Begin typing your search above and press return to search.

మోదీ వద్దకు దీదీ.... వాటిజ్ ద మ్యాటర్?

By:  Tupaki Desk   |   17 Sep 2019 3:33 PM GMT
మోదీ వద్దకు దీదీ.... వాటిజ్ ద మ్యాటర్?
X
ప్రధాని నరేంద్ర మోదీ * ఆయన అత్యంత సన్నిహితుడు - బీజేపీ జాతీయ అధ్యక్షుడు - ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిగా ఉన్న అమిత్ షాతో ఢీ అంటే ఢీ అంటూ సాగిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... ఎందుకనో ఇప్పుడు తన వైఖరిని పూర్తిగా మార్చేసుకున్నట్లుగానే కనిపిస్తున్నారు. మోదీ - షాలే కాకుండా మొత్తంగా బీజేపీ అంటేనే అంతెత్తున ఎగిరిపడ్డ దీదీ... ఇప్పుడు అదే మోదీ వద్దకు వెళ్లేందుకు, ఆయనతో భేటీ అయ్యేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటు ఢిల్లీతో పాటు అటు కోల్ కతాలోని అధికార వర్గాల సమాచారం మేరకు రేపు హస్తిన వెళ్లనున్న దీదీ... నేరుగా మోదీ వద్దకు వెళ్లనున్నారట.

మోదీతో దీదీ భేటీ అంటేనే చాలా ఇంటరెస్టింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే... మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయనతో దీదీ బస్తీ మే సవాల్ అన్న దిశగానే సాగారు. సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు మొదలవుతున్న నేపథ్యంలో కోల్ కతాలో భారీ ర్యాలీకి బీజేపీ యత్నించడం, అందులో అమిత్ షా స్వయంగా పాలుపంచుకునేందుకు రంగం సిద్ధం కాగా... ఆ ర్యాలీకి అనుమతి లేదంటూ దీదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అప్పటినుంచి బీజేపీ, తృణమూల్ మధ్య వార్ తారాస్థాయికే వెళ్లిందని చెప్పక తప్పదు.

కేంద్ర ప్రభుత్వం నియంత్రణలోని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి తన రాష్ట్రంలో అనుమతి లేదంటూ సంచలన నిర్ణయం తీసుకున్న దీదీ... శారదా చిట్ ఫండ్ స్కాం విచారణాధికారిగా వ్యవహరించిన పోలీసు అధికారిని విచారించేందుకు సీబీఐ అధికారులు వెళితే... తన అనుమతి లేకుండా దర్యాప్తు ఎలా సాగిస్తారంటూ వారిని దీదీ వర్గం తరిమి కొట్టినంత పనిచేశారు. ఈ సందర్బంగా రెండు రోజుల పాటు దీదీ నడిరోడ్డుపై దీక్ష కూడా చేపట్టిన వైనం దేశంలో కలకలం రేపిందనే చెప్పాలి. వరుస యుద్దాలతో మోదీ, దీదీ బద్ధ శత్రువులుగానే మారిపోయారన్న వాదనలు కూడా గట్టిగానే వినిపించాయి.

ఇలాంటి కీలక తరుణంలో ఇప్పుడు నేరుగా ఢిల్లీకి వెళుతున్న దీదీ... మోదీతో భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీదీ ఢిల్లీ టూర్, ఆమెకు మోదీ అపాయింట్ మెంట్ తదితర విషయాలు ఆసక్తి రేకెత్తిస్తుండగా... అసలు మోదీతో భేటీకి దీదీ ఎందుకు సంకల్పించారు అన్న విషయం దానికంటే కూడా ఆసక్తి రేపుతోంది. ప్రధానిగా మోదీని మర్యాదపూర్వకంగానే కలిసేందుకు ఢిల్లీ వెళుతున్నానని, పశ్చిమ బెంగాల్ పేరు మార్పు, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల విషయంపై చర్చించేందుకే మోదీ వద్దకు వెళుతున్నానని దీదీ చెబుతున్నా కూడా ఏ ఒక్కరు నమ్మడం లేదు. అదే సమయంలో బీజేపీ నేతలు కూడా దీదీపై తమదైన శైలి విమర్శలు గుప్పిస్తున్నారు. శారదా చిట్ ఫండ్ కేసుతో పాటు పలు కేసుల్లో పీకల్లోతు ఇరుక్కున్న దీదీ... తనను తాను రక్షించుకునేందుకే మోదీ వద్దకు కాళ్ల బేరానికి వెళుతున్నారని వారు చెబుతున్నారు. కారణాలేంటో తెలియదు గానీ... రేపు జరిగే మోదీ, దీదీ భేటీ మాత్రం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగానే మారిందని చెప్పక తప్పదు.