Begin typing your search above and press return to search.

జడ్జిపై ఫిర్యాదు చేసిన సీఎం

By:  Tupaki Desk   |   19 Jun 2021 5:30 AM GMT
జడ్జిపై ఫిర్యాదు చేసిన సీఎం
X
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకొని వార్తల్లో నిలిచారు. ఓ జడ్జిపై ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించారు. ఆ జడ్జి తమ కేసును విచారించొద్దని బెంగాల్ సీఎం ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

కోల్ కతా జడ్జిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. జస్టిస్ కౌశిక్ చందాకు బీజేపీ నేపథ్యం ఉందని.. ఆయన తన పిటీషన్ విచారణ చేపట్టోద్దని కోరుతూ మమతా బెనర్జీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ మేరకు లేఖను తన తరుఫు న్యాయవాది ద్వారా అందజేశారు.

*అసలు వివాదం ఇదీ..
ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా పోటీచేశారు. తన పాత సహచరుడు, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల్లో, ఓట్ల లెక్కింపులోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని.. కావున ఎన్నిక రద్దు చేయాలని కోరుతూ మమత హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ ను జస్టిస్ కౌశిక్ చందా విచారణ చేపట్టారు. ఈ పిటీషన్ ప్రజా ప్రాతినిధ్యం చట్టం-1951కి అనుగుణంగా వేశారా అనే విషయమై ఓ నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ కు జడ్జి ఆదేశాలు ఇచ్చారు.

ఈ క్రమంలోనే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం మమత. వెంటనే ఆ జడ్జిని తన కేసు విచారించకుండా చూడాలని.. ఆయనకు బీజేపీ నేపథ్యం ఉందని చీఫ్ జస్టిస్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఇక జస్టిస్ కౌశిక్ ను హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమించడంపై కూడా సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ వైఖరికి మద్దతుగా కొంతమంది న్యాయవాదులు కోల్ కతా హైకోర్టు ఎదుట నిరసన ప్రదర్శన చేయడం చర్చనీయాంశమైంది.