కేబినెట్ లోకా .. స్పీకర్ గానా..?!

Mon May 27 2019 17:12:26 GMT+0530 (IST)

Malladi Vishnu To Be Andhra Assembly Speaker

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి అతి స్వల్ప మెజారిటీతో నెగ్గి ఎమ్మెల్యే అయిన మల్లాది విష్ణు కు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏ అవకాశాన్ని ఇవ్వనున్నారనేది ఆసక్తిదాయకంగా మారింది. అత్యంత కీలకమైన విజయవాడ ప్రాంతం నేత కావడం - సీనియర్ కావడం - గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత అనుంగు అనుచరుడిగా వ్యవహరించి ఉండటం.. ఇవన్నీ  కూడా మల్లాది విష్ణుకు  అనుకూలాంశాలు. అలాగే బ్రహ్మిణ్ కోటాలో కూడా ఈయనకు మంచి అవకాశం ఉంది.ఏపీ అసెంబ్లీలో ఇద్దరే బ్రహ్మణ ఎమ్మెల్యేలు ఉంటారు. కోన రఘుపతి - మల్లాది విష్ణు.. వీళ్లిద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన వారే.  వీరి సీనియారిటీ నేపథ్యంలో వీరిద్దరికీ జగన్ అవకాశం ఇవ్వడం ఖాయమైంది.

ఈ నేపథ్యంలో మల్లాది విష్ణుకు జగన్ మోహన్ రెడ్డి స్పీకర్ పదవిని ఆఫర్ చేస్తున్నారని తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించాలని మల్లాదికి జగన్ ప్రతిపాదిస్తూ ఉన్నారట.  మల్లాది విష్ణు మాత్రం తనకు స్పీకర్ పదవి కన్నా కేబినెట్  అంటేనే ఎక్కువ ఆసక్తి ఉందని చెబుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే జగన్ కేబినెట్లో బెర్తుల కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలుగా నెగ్గి రావడంతో వారిలో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది.

ఎంతోమంది సీనియర్లు జగన్ కు అత్యంత విధేయులు ఎన్నికల్లో నెగ్గి వచ్చారు. దీంతో ఎవరికి అవకాశం ఇవ్వాలో ఎవరిని పక్కన పెట్టాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి. దీంతో కొందరికి నామినేటెడ్ పోస్టులు స్పీకర్ తరహా బాధ్యతలు అప్పగించి కొందరు సీనియర్ల బరువును జగన్ దించుకోవాలని భావిస్తున్నారని సమాచారం.