రేవంత్ పై చెలరేగిన మల్లారెడ్డి.. అతడి బిడ్డ పెళ్లి నా డబ్బులతోనే చేశాడు

Tue May 24 2022 16:00:42 GMT+0530 (IST)

MallaReddy Coments on Revanth Reddy

గడిచిన కొద్దిరోజులుగా తెలంగాణలో రాజకీయం వాడివేడిగా మారిన సంగతి తెలిసిందే. మండే ఎండలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో వివిధ పార్టీ నేతలు చేసుకుంటున్న విమర్శలు.. ఆరోపణలు మరింత వేడి పుట్టిస్తున్నాయి. సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడటమే కాదు.. భారీ ఎత్తున భూదందా ఆరోపణలు చేశారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినంతనే మల్లారెడ్డిని.. అతని అల్లుడ్ని అరెస్టు చేసి లోపల వేయిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి మల్లారెడ్డి మరింతగా చెలరేగిపోయారు. పలు అభ్యంతరకర.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో రేవంత్ వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావించటమే కాదు.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు. ''రేవంత్ రెడ్డి ది పుచ్చ బండ. రేవంత్ రెడ్డి ఓ పెద్ద దొంగ.. రెడ్డి కాదు. రేవంత్ రెడ్డివి బట్టేబాజ్ మాటలు పెద్ద లుచ్ఛా. అతడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఖతం'' అంటూ విరుచుకుపడ్డారు. అంతేకాదు తాను యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేసి చెబుతున్నానని.. రేవంత్ బడ్డ పెళ్లి చేసింది తన డబ్బులతోనేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పింది నిజం కాదని ఓట్టేసి చెప్పే దమ్ముందా రేవంత్ కు? అని ఆయన సవాలు విసిరారు.

టీడీపీలో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇస్తే ఎవరిని లెక్క చేయలేదని.. తనను చాలా బాధలు పెట్టాడన్నారు. మల్కాజిగిరి టికెట్ కు అడ్డు వస్తే కాలేజీ మూయిస్తానని బ్లాక్ మొయిల్ చేశాడని.. రేవంత్ దుర్మార్గాలు చంద్రబాబుకు చెబితే టికెట్ తనకిచ్చారన్నారు. దీంతో తనను చాలా ఇబ్బంది పెట్టాడని.. డబ్బుల కోసం తనను బ్లాక్ మొయిల్ చేసినట్లుగా పేర్కొన్నారు. 'అసలు రేవంత్ ఏం చేసి సంపాదించాడు? అతడికి అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి?' అని ప్రశ్నించారు.
2024లో దేశానికి అధినేతగా కేసీఆర్ కాబోతున్నారని.. ఇది ఖాయమన్నారు.

తమ పార్టీ అధినేత దేశాన్ని ఏలబోతున్నట్లుగా మల్లారెడ్డి పేర్కొన్నారు.  తమ నాయకుడు కేటీఆర్ తెలంగాణ యువత కోసం ఉద్యోగాల కోసం దేశాలు తిరుగుతున్నాడన్నారు. కాంగ్రెస్ దివాలా తీసిన పార్టీగా అభివర్ణించిన మల్లారెడ్డి.. 56 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ రైతులను ఎందుకు పట్టించుకోలేదు? అని ప్రశ్నించారు. అందుకే దేశంలో ప్రజలు కాంగ్రెస్ ను ఖతం చేశారన్నారు. రాహుల్ గాంధీ నైట్ క్లబ్ లకు వెళతాడని.. ఆయనకు ఒక పెళ్లి లేదు.. పెటాకులు లేవు.. అతనితో డిక్లరేషనా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  'కేసీఆర్ పంజాబ్ లో చెక్కులు పంచడం కాదు.. దేశమంతా చెక్కులు పంచుతాడు.

కేసీఆర్ దేశాన్ని పాలించడం ఖాయం తెలంగాణలో ఇస్తున్న పథకాలు దేశమంతా ఇస్తారు. కాంగ్రెస్ మొహాలకు ఎం చేయడం తెలుసు. బీజేపీ దేశాన్ని దివాళా తీయిస్తోంది. ప్రత్యామ్నాయం కేసీఆర్ ఎజెండా నే. హైద్రాబాద్ చూస్తే కేసీఆర్ గొప్పతనం తెలుస్తుంది. ఖబడ్ధార్ రేవంత్ రెడ్డి.. నోరు జాగ్రత్త. కేసీఆర్ అన్ని కులాలను బాగా చూసుకుంటున్నాడు' అని వ్యాఖ్యానించారు.

తాను భూములు కొనటం తప్పు ఎలా అవుతుందన్న మల్లారెడ్డి.. డబ్బులు పెట్టి బాజప్త కొన్నట్లుగా పేర్కొన్నారు. రేవంత్ ను ఎక్కడికి వెళ్లినా చెప్పులతో కొట్టమని చెబుతామన్నారు. తమ కాలేజీ పక్కన ఒక పార్టీ ఉందని.. దాన్లో 8 గుంటలు తీసుకొని.. ఆ భూమికి బదులుగా మరో భూమిని హెచ్ ఎండీఏకు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ''నేను ఏ భూములు కొన్నా చట్టబద్ధంగా కొన్నా. ఎంతో మంది డాక్టర్లు ఇంజినీర్లను ఫార్మా సిస్టులను తయారు చేశా. నువ్వు మాత్రం రక్తం పీల్చే జలగవు. రేవంత్ ను జైలు కు పంపిస్తా. లీగల్‌గానే వెళ్తా. రేవంత్ పేదల పొట్ట గొడుతున్నారు' అంటూ ఆవేశంతో ఊగిపోయారు మంత్రి మల్లారెడ్డి.