తెలంగాణ మంత్రి చేసిన పనికి అంతా షాక్

Tue Aug 11 2020 22:17:25 GMT+0530 (IST)

Everything is shocking for the work done by the Telangana minister

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సహచరుడు చేసిన పని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏ విషయమైనా దాచుకోకుండా బయటకు చెప్పే నేత అనే పేరున్న తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడం అనంతరం ఆయన కోలుకోవడం తెలిసిన సంగతే. అనంతరం ఆయన ఓ వీడియో విడుదల చేస్తూ కరోనాకు మెడిసిన్‌తో పాటు ధైర్యంగా ఉంటే పూర్తిగా కోలుకోవచ్చు అని పలు సూచనలు చేశారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా కరోనా వచ్చిన సమయంలో ఆ విషయం తెలియజేసి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే బదులుగా రికవరీ అయిన తర్వాత వెల్లడించడం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.భోళాగా మాట్లాడే అతికొద్ది మంది రాజకీయనాయకుల్లో ఒకరైన మల్లారెడ్డి కరోనా బారిన పడిన విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 2వ తేదీ ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో... హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు. అయితే మల్లారెడ్డికి కరోనా సోకిన విషయం మీడియాలో వచ్చింది. దీంతో స్పందించిన ఆయన.. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటి నుండి సెల్ఫ్ ఐసోలేషన్ ఉండి అనంతరం పూర్తిగా కోలుకున్నానని వెల్లడించారు.

అయితే కరోనా నిర్ధారణ అయిన మిగతా టీఆర్ఎస్ నేతల తీరుకు మల్లారెడ్డి వైఖరికి మధ్య ఎంతో తేడా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాజిరెడ్డి గోవర్దన్ బిగాల గణేష్ సుధీర్‌రెడ్డి పైలెట్ రోహిత్ రెడ్డి తదితరులు కోవిడ్ నిర్ధారణ అయిన తర్వాత ఈ విషయాన్ని బయటకు వెల్లడించారు. తమతో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కానీ మల్లారెడ్డి మాత్రం అలాంటిదేమీ చేయకుండా రికవరీ అయిన తర్వాత ఆ విషయాన్ని ప్రకటించడం మంచి మాటలు చెప్పడం చర్చకు దారితీస్తున్నాయి.