Begin typing your search above and press return to search.

వంద సీట్ల‌పై మ‌జ్లిస్ గురి.. యూపీలో మారుతున్న రాజ‌కీయ ముఖ చిత్రం

By:  Tupaki Desk   |   23 Nov 2021 1:30 PM GMT
వంద సీట్ల‌పై మ‌జ్లిస్ గురి.. యూపీలో మారుతున్న రాజ‌కీయ ముఖ చిత్రం
X
హైద‌రాబాద్‌కు చెందిన మ‌జ్లిస్ పార్టీ.. ఎంఐఎం.. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌పై గురి పెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు 50 లేదా 60 సీట్ల‌కు ప‌రిమితం అవుతుంద‌ని.. భావించిన అస‌దుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఈ పార్టీ ఇప్పుడు ఏకంగా 100కు పైగా సీట్ల‌లో తాము పోటీ ప‌డుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

నిజానికి 400ల‌కు పైగా ఉన్న సీట్ల‌లో వంద సీట్ల‌కు మ‌జ్లిస్ పోటీ ప‌డ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీంతో ఈ పోటీతో ఎవ‌రు లాభ ప‌డ‌తారు? ఎవ‌రు న‌ష్ట‌పోతారు? అనే చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది.

బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్తో పాటు ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మరో పార్టీ ఎంఐఎం. పార్టీ మూలాలను దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. యూపీ ఎన్నికల బరిలోకి దిగి, విజయం సాధించి.. స‌త్తా చాటాల‌ని చూస్తున్నారు.

ఈ క్రమంలో ముస్లిం ప్రాబల్య ప్రాంతాలపై కన్నేశారు. మొత్తం యూపీ అసెంబ్లీలో 403 స్థానాలు ఉండగా.. 100 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.

ఇక‌, ఎంఐఎం.. వ్యూహాన్నిప‌రిశీలిస్తే.. దళితులు, ముస్లింల ఓట్లనే లక్ష్యంగా చేసుకొని ఎంఐఎం ఎన్నికల బరిలో దిగుతోందని విశ్లేష‌కులు భావిస్తున్నారు. యూపీ జనాభాలో 40 శాతానికి పైగా ఈ రెండు సామాజిక వర్గాలే ఉన్నాయి. వీరంతా సమాజ్వాదీ పార్టీ ఓటు బ్యాంకుగా ఉన్నారు.

మజ్లిస్ ఒంటరిగా పోటీ చేస్తే ఎక్కువగా నష్టపోయేది అఖిలేశ్ నేతృత్వంలోని ఎస్పీనే. ముస్లిం, దళితుల ఓట్లను ఎంఐఎం చీల్చగలిగితే.. ఎస్పీకి అపార నష్టం జరుగుతుంది. అంతిమంగా ఇది బీజేపీకి లాభిస్తుంద‌నే అంచ‌నా ఉంది.

వాస్త‌వానికి ఇతర పార్టీలతో పొత్తు కోసం ఆది నుంచీ ఒవైసీ ప్రయత్నాలు చేశారు. అయితే, ఆయన ప్రయ త్నాలేవీ ఫలించలేదు. తొలుత పెద్ద పార్టీలపైనే దృష్టిసారించి చిన్న పార్టీలను దూరం చేసుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)తో కూటమి ఏర్పాటు చేయాలని భావించారు. కానీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూటమి అంశాన్ని బహిరంగంగానే కొట్టిపారేశారు.

ఆ తర్వాత ఓంప్రకాశ్ రాజ్భర్తో కలిసి 'భాగీదారీ సంకల్ప్ మోర్చా' పేరుతో కూటమి ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేశారు. అయితే, చివరి క్షణంలో సమాజ్వాదీ పార్టీతో చేతులు కలిపిన రాజ్భర్.. ఒవైసీకి హ్యాండ్ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో ఒవైసీ ఒంట‌రి పోరుకే దిగ‌నున్న‌ట్టు స‌మాచారం. మ‌రి చివ‌రి నిముషంలో ఎవ‌రైనా క‌లిసి వ‌స్తే.. పొత్తుకు సిద్ధంగానే ఉన్నారు. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.