``పూంఖ్``ను మించిన సస్పెన్స్ థ్రిల్లర్ పాలిటిక్స్.. మహాలో క్షణ క్షణం..!

Tue Jun 28 2022 22:00:01 GMT+0530 (IST)

Maharastra Political Crisis

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీసిన ఫూంఖ్ సినిమా గుర్తుందికదా! అడుగడుగునా.. థ్రిల్లర్. క్షణ క్షణం సస్పెన్స్. ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ. అయితే.. అది సినిమా. కానీ.. దీనికి మించిన వాస్తవం.. ఈ సినిమాను మించిన థ్రిల్లర్.. ఉత్కంఠ.. సస్పెన్స్ అన్నీ కలిపి మిక్సీ పడితే.. మహారాష్ట్ర రాజకీయం కనిపిస్తోంది. ఏ క్షణం ఈ రాజకీయం ఎటు మలుపు తిరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఒక వైపు శివసేన రెబల్స్‌ను దువ్వు తుంటే.. రెబల్స్‌ను బీజేపీ చేరదీస్తోంది. దీంతో మహారాష్ట్ర రాజకీయం మరింత చిత్ర విచిత్రంగా మారిపోయింది.శివసేన ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో తిరుగుబాటుతో మొదలైన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. జులై 11 వరకు అనర్హత వేటు వేయద్దని రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించిన వేళ వారిని బుజ్జగించేందుకు శివసేన అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మరో ప్రయత్నం చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా గువాహటి నుంచి ముంబయి తిరిగొచ్చి తనతో చర్చలు జరపాలని వారికి లేఖ రాశారు. అంతా కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తాజా పరిణామాలపై మహారాష్ట్ర ప్రజలు శివ సైనికుల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించాలని కోరారు.

అంతకుముందు రెబల్ ఎమ్మెల్యేల్లో సగం మందికిపైగా తమను సంప్రదిస్తున్నారని శివసేన సీనియర్ నేత ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. వారిని గువాహటిలో బలవంతంగా నిర్బంధించారన్న ఆయన వారు తప్పకుండా ఠాక్రే వర్గంలోకి తిరిగొస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై తిరుగుబాటు నేత ఏక్‌నాథ్   మండిపడ్డారు. తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శివసేన నాయకత్వంతో ఎవరూ సంప్రదింపులు జరపడం లేదంటూ   మీడియాకు వెల్లడించారు. ఎమ్మెల్యేలంతా స్వచ్చందంగానే తన వద్దకు వచ్చారని వారిని ఎవరూ నిర్బంధించలేదని పేర్కొన్నారు. బాల్ ఠాక్రే విశ్వసించే.. హిందుత్వ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నదే వారి అభిమతమని తెలిపారు.  

మరోవైపు.. మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులను బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది. 'మహా వికాస్ అఘాడీ' కూటమిని దెబ్బ కొట్టేందుకు అదును కోసం వేచి చూస్తోంది. ఇందుకోసం కార్యాచరణను సిద్ధం చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ రంగంలో దిగినట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించేందుకు అగ్రనేతలను కలుస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. సంక్షోభం విషయంలో ఫడణవీస్ జోక్యం చేసుకోవద్దని స్వయంగా శివసేన కీలక నేత సంజయ్ రౌత్ చెప్పడం వల్ల.. బీజేపీ వ్యూహాలు రచిస్తోందని  స్పష్టమవుతోంది. మొదట గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలవడం ద్వారా.. అఘాడీ కూటమిని మరింత ఇరకాటంలో పెట్టే వ్యూహాంతో ముందుకెళ్లాలని భావిస్తోంది. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయం ఎప్పుడు ఎటు మలుపు తిరుగుతుందనేది ఆసక్తిగా మారింది.