Begin typing your search above and press return to search.

థాక్రే పేరుపై మొదలైన వివాదం

By:  Tupaki Desk   |   26 Jun 2022 8:30 AM GMT
థాక్రే పేరుపై మొదలైన వివాదం
X
మహారాష్ట్రలో సంక్షోభం చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతోంది. శివసేనకు చెందిన మంత్రి ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో సుమారు 40 మంది ఎంఎల్ఏలు తిరుగుబాటు లేవదీయటంతో అధికార మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వ వ్యవహారం దిన దిన గండం నూరేళ్ళాయుష్షు గా మారిపోయింది. కూటమిలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు బాగానే ఉన్నాయి కానీ హఠాత్తుగా శివసేనలో చీలిక మొదలైంది.

మెజారిటీ ఎంఎల్ఏలున్న తమ వర్గానిదే అసలైన శివసేనగా తిరుగుబాటు నేత షిండే ప్రకటించుకున్నారు. అయితే ఆ వాదన వీగిపోతుందని అర్ధమయ్యిందో ఏమో. వెంటనే తమ వర్గానికి శివసేన (బాలా సాహెబ్) అని పేరు ప్రకటించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. బాలాసాహెబ్ అంటే శివసేన వ్యవస్ధాపకుడు, సీఎం ఉద్ధవ్ థాక్రే తండ్రి బాల్ థాక్రేనే. బాల్ థాక్రేని అందరు బాలాసాహెబ్ అనంటారు. తన తండ్రి పేరుని షిండే తన చీలిక వర్గానికి పేరు పెట్టుకోవటాన్ని ఉద్ధవ్ తీవ్రంగా ఆక్షేపించారు.

తన తండ్రి పేరు పెట్టుకునేందుకు వీల్లేదని కాబట్టి ఆ పేరును గుర్తించద్దంటు కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఉద్ధవ్ లేఖ కూడా రాశారు. కొత్త పార్టీ పెట్టుకుని ఆ పార్టీకి షిండే తన తండ్రి పేరును పేరు పెట్టుకోవాలని ఉధ్ధవ్ ఘాటుగా చెప్పారు. థాక్రే అంటే నాలుగు ఓట్లు పడతాయి కానీ షిండే తండ్రి పేరు పెట్టుకుంటే ఏమొస్తుంది ? ఈ విషయం చీలిక వర్గం నేత షిండేకీ బాగా తెలుసు అలాగే థాక్రేకి కూడా తెలుసు. అందుకనే ఇపుడు ఇద్దరు థాక్రే పేరు విషయంలో వివాదానికి దిగారు.

నిజానికి ఎవరు కూడా మరొకళ్ళ పేరును పెట్టుకోవడం జరగదు. కాంగ్రెస్ పేరుతో చాలా పార్టీలే ఉన్నా ఇందిరా కాంగ్రెస్ పేరుతో ఉన్నది మాత్రం ఒకే పార్టి. జనతాదళ్ పేరుతో చాలా పార్టీలున్నా ఒడిస్సాలోని బిజూ పట్నాయక్ పేరుతో ఉన్నది మాత్రం బిజూ జనతాదళ్ ఒక్కటే. వ్యక్తుల పేర్లతో మొదలైన పార్టీలపై సర్వహక్కులు వాళ్ళ వారసులకు మాత్రమే దక్కుతుంది కానీ ఎవరంటే వాళ్ళు వాడుకునేందుకు లేదు.