కేసీఆర్ ‘జాతీయ’ అడుగులకు ‘మహా’ షాక్

Wed Sep 28 2022 06:00:01 GMT+0530 (India Standard Time)

Maharashtra Farmers Accuses Telangana Daily Of Wrong Attribution

దేశ్ కీ నేత అనిపించుకోవాలని కేసీఆర్ ఉబలాటపడుతున్నాడు. అందుకే తెలంగాణ అభివృద్ధిని పత్రికలు మీడియాలో యాడ్స్ రూపంలో కోట్లు కుమ్మరించి మరీ ప్రచారం చేసుకుంటున్నారు. హిందీ జాతీయ పత్రికలు మీడియాలో కేసీఆర్ ఘనతను చాటింపు వేసుకుంటున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా.. పక్కనున్న మహారాష్ట్ర రైతులు కేసీఆరే కావాలని.. ఆయన జాతీయ నేతగా ఉండాలని కోరుతున్నట్టు ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రావాలని మహారాష్ట్ర రైతులు కోరుతున్నట్టు హల్ చల్ చేసింది.తాజాగా ఈ వార్తపై మహారాష్ట్ర రైతులు స్పందించారు. కేసీఆర్ జాతీయరాజకీయాల్లోకి రావాలని తాము కోరుకుంటున్నట్టు వస్తున్న వార్తలు అసత్య ప్రచారం అని మహారాష్ట్ర రైతులు మండిపడ్డారు. తమను సంప్రదించకుండా అభిప్రాయల పేరిట తప్పుడు కథనం ప్రచురించారని ఆగ్రహిస్తూ మహారాష్ట్ర రైతులు తెలంగాణకు చెందిన ఓ వార్తపత్రిక ప్రతులను తాజాగా దహనం చేశారు.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని తాము కోరుకోలేదని. . తమ ప్రమేయం లేకుండా తమ అభిప్రాయాలను ఎలా ప్రచురిస్తామని నిలదీశారు. గడ్చిరోలి జిల్లా సిరొంచ తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం రైతులు నిరసన తెలిపారు.కాళేశ్వరం ఎగువనున్న రైతులంతా కలిసి ఇలా నిరసన వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో తాము ఎంతో నష్టపోతున్నామని.. 15 గ్రామాల రైతులు పంటలు పండించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశఆరు. పొలాలు నష్టపోయిన తమకు తెలంగాణ ప్రభుత్వం కనీసం పరిహారం కూడా ఇవ్వలేదని వారంతా వాపోయారు. కేసీఆర్ పనితీరుతో తీవ్రంగా నష్టపోయిన తాము ఆయన్ని ఎలా సమర్థిస్తామని మండిపడ్డారు.

మూడు నెలల క్రితం ఓ తెలంగాణ విలేకరి ఫొటో అడిగితే ఇచ్చానని.. మిగిలిన వారి ఫొటోలు ఫేస్ బుక్ లోంచి సేకరించి కేసీఆర్ జాతీయ నేత కావాలని మహారాష్ట్ర రైతులు కోరుతున్నట్టు తప్పుడు కథనం ప్రచురించినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం ఎగువన ఉన్న తమకు ఆ ప్రాజెక్టుతో నిండా మునిగామని.. దానికి రివర్స్ గా కథనం రాసి తమను మోసం చేశారని ఆ రైతులంతా రోడ్డెక్కిన పరిస్థితి నెలకొంది.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఇంకా రాకముందే ఇలా రైతులు రోడ్డెక్కడంతో ఆయన దేశ్ కీ నేత కలలు ఎలా ముందుకు సాగుతాయన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.