Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో సెకండ్ వేవ్ కలకలం.. సీఎం మాటలతో కొత్త టెన్షన్

By:  Tupaki Desk   |   27 Sep 2020 11:50 AM GMT
మహారాష్ట్రలో సెకండ్ వేవ్ కలకలం.. సీఎం మాటలతో కొత్త టెన్షన్
X
దేశాన్ని కిందా మీదా పడేస్తున్న కరోనా.. ఇప్పుడు మరో కొత్త ముప్పుగా దేశానికి మారింది. మిగిలిన దేశాలతో పోలిస్తే.. కరోనాకు ముందే దేశ వ్యాప్తంగా హడావుడిగా లాక్ డౌన్ విధించటంతో కాస్త ఆలస్యంగా ఈ వైరస్ వ్యాప్తి సాగింది. రోజులు గడుస్తున్నా.. కేసులు పెరగటమే కానీ తగ్గని పరిస్థితి. దీనికి తోడు దేశ ఆర్థిక పరిస్థితితో పాటు.. రాష్ట్రాల ఆదాయాలు దారుణంగా దెబ్బ తిన్న దుస్థితి. దీంతో.. కరోనాతో సహజీవనం తప్పించి మరే దారి లేదన్న వాస్తవాన్ని గుర్తించి.. అన్ లాక్ సిరీస్ షురూ చేశారు.

మల్టీఫ్లెక్సులు.. సినిమా థియేటర్లు..స్కూళ్లు..కాలేజీలు.. సోషల్ ప్రోగ్రామ్ లు తప్పించి మిగిలినవన్నీ దాదాపు తెరిచారు. దీని వల్ల ఆర్థిక పరిస్థితి రికవరీ దిశగా అడుగులు వేస్తోంది. అయితే.. కేసుల తీవ్రత మాత్రం పెరుగుతోంది. తాజాగా రోజుకు 85వేల కేసులు నమోదవుతున్నాయి. మొన్నటివరకు 92వేల వరకు రోజుకు నమోదయ్యే స్థానే.. ఇప్పుడు కేసుల నమోదు తగ్గి.. రికవరీలు పెరుగుతున్నాయి.

ఇదంతా నాణెనికి ఒకవైపు మాత్రమే. దేశంలో అత్యధికంగా కేసులు నమోదయ్యే రాష్ట్రాల్లో ఒకటైన ఢిల్లీలో ఇప్పుడు సెకండ్ వేవ్ షురూ అయినట్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతున్నారు. దీనికి తగ్గట్లే.. కేరళలోనూ సెకండ్ వేవ్ స్టార్ట్ కావటం.. పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ షురూ అయితే.. దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందన్నది తెలిసిందే. తాజాగా మహారాష్ట్రంలోనూ అలాంటి పరిస్థితే ఉందన్న విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వెల్లడించారు. అంత పెద్దగా రోగ లక్షణాలు లేని వారంతా ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకునేందుకు అనుమతిని ఇచ్చిన తర్వాత కూడా ప్రజలు బయటకు వస్తున్నారని చెప్పారు.

ఇలాంటి వారి కారణంగా మిగిలిన వారిలో వైరస్ వ్యాప్తి చెందేందుకు కారణమవుతున్నట్లు తెలిపారు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా తిరుగుతున్న వారి కారణంగా ఆరోగ్యవంతులు సైతం వైరస్ బారిన పడుతున్నట్లుగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ట్రేసింగ్.. టెస్టింగ్ పెరగాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని.. అయితే ప్రజలంతా నా కుటుంబం.. నా బాధ్యత అన్న భావనతో వ్యవహరించాలని కోరుతున్నారు. ఇప్పటికే దేశంలో అత్యధిక కేసులు నమోదయ్యే రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉండే మహారాష్ట్రలో సెకండ్ వేవ్ షురూ అయితే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందన్న ఊహే భయాన్ని కలిగిస్తుందని చెప్పక తప్పదు.