బిగ్ బ్రేకింగ్ : సీఎం రాజీనామా..?

Fri Nov 08 2019 17:25:06 GMT+0530 (IST)

మహారాష్ట్ర రాజకీయం క్షణక్షణానికి మలుపు తిరుగుతూ ఉత్కంఠగా మారుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. కానీ ఇప్పటివరకు ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించలేదు. దీనితో ఏంజరుగుతుందో అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా  మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కలసి తన రాజీనామాను సమర్పించారు.  ఈ రోజుతో మహారాష్ట్రలో అసెంబ్లీ పదవీకాలం ముగిసింది. దీనితో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ను కలసి తన రాజీనామాను సమర్పించారు.మహారాష్ట్రలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఎన్నికల ముందు బీజేపీ - శివసేన పొత్తు పెట్టుకుని కలసి ఎన్నికల బరిలో నిలిచాయి.  బీజేపీకి 105 శివసేనకు 56 సీట్లు వచ్చాయి. రెండు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కానీ రెండున్నరేళ్లు తమకు ముఖ్యమంత్రి పదవి కావాలని శివసేన పట్టుబట్టడంతో మహారాష్ట్ర పంచాయతీ కొనసాగుతోంది. రాజీనామా చేసిన తర్వాత మాజీ సీఎం ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. తనకు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చినందుకు బీజేపీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. తన ఐదేళ్ల పాలనలో సహకరించిన శివసేనకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన ఐదేళ్ల పదవీకాలంలో మహారాష్ట్రలో చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యంగా  రైతుల కోసం ముంబై కోసం తాను తీసుకొచ్చిన పథకాల గురించి తెలిపారు.