రంజీల్లో కొత్త చరిత్ర... విజేత మధ్యప్రదేశ్.. సీఎం పట్టరాని ఆనందం

Sun Jun 26 2022 21:00:01 GMT+0530 (IST)

Madhyapradesh In Ranji Trophy

భారత దేశవాళీ క్రికెట్ లో అత్యున్నతం రంజీ ట్రోఫీ. ఇప్పుడంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చింది కానీ.. ఓ పదిహేనేళ్ల కిందటి వరకు రంజీల్లో ప్రదర్శనే టీమిండియా ఎంపికకు గీటురాయి. అలాంటి రంజీల్లో 41 సార్లు చాంపియన్ ముంబై. అసలు రంజీ రారాజు ముంబై. ఇప్పుడా ముంబైనే ఓడించి చాంపియన్ గా నిలిచింది మధ్యప్రదేశ్. ఆ రాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ గెల్చుకోవడం ఇదే తొలిసారి. కాగా ఈ మ్యాచ్ కు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిచ్చింది.డ్రాతో గెలుస్తుందనుకుంటే.. నేరుగానే గెలిచేసింది ఈ నెల 22 నుంచి ఆదివారం వరకు ఐదు రోజుల పాటు జరిగిన రంజీ ఫైనల్లో ముంబైని 6 వికెట్లతో ఓడించింది మధ్యప్రదేశ్. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై మొదటి ఇన్నింగ్స్ లో 374 పరుగులకు ఆలౌట్ అయింది. సర్ఫరాజ్ ఖాన్ 134 (234 బంతుల్లో 13×4; 2×6) సెంచరీ చేశాడు. అయితే దీనికి మధ్యప్రదేశ్ బ్యాట్స్ మెన్ దీటుగా బదులిచ్చారు. ఓపెనర్ యశ్ దూబే 133 (336 బంతుల్లో 14×4) సహా శుభంశర్మ 116 (215 బంతుల్లో 15×4; 1×6) రజత్ పటీదార్ 122 (219 బంతుల్లో 20×4) సెంచరీలతో అదరగొట్టగా చివర్లో సారాంశ్ జైన్(57) అర్ధశతకంతో రాణించాడు. దీంతో మధ్యప్రదేశ్ 536 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో ఆ జట్టుకు 162 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అయితే అప్పటికి నాలుగున్నర రోజుల ఆట ముగిసింది. రంజీల్లో ఫలితం తేలకుంటే.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఈ లెక్కన మధ్యప్రదేశ్ కే టైటిల్ దక్కుతుంది.

ఈ నేపథ్యంలో ఒకటిన్నర రోజుల ఆట మాత్రమే ఉండడంతో ముంబై తాడో పేడో తేల్చుకోవాలని భావించింది. రెండో ఇన్నింగ్స్ లో ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. కెప్టెన్ ప్రథ్వీ షా (44) సువేద్ పార్కర్ (51) సర్ఫరాజ్ ఖాన్ (45) వేగంగా ఆడారు. కానీ మిగతావారు పెద్దగా పరుగులు చేయలేదు. దీంతో ఆ జట్టు  269 పరుగులకు ఆలౌట్ అయింది. 108 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్షాన్ని ఛేదించింది.

కోచ్ కన్నీరు.. సీఎం మహదానందం ముంబైకి చెందిన చంద్రకాంత్ పండిట్ మధ్యప్రదేశ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఈయన టీమిండియా మాజీ ప్లేయర్. తమ జట్టు ట్రోఫీ నెగ్గడంతో పండిట్ ఆనందానికి అవధుల్లేవు. పండిట్ భావోద్వేగతో కన్నీటి పర్యంతమయ్యారు. 1999లో పండిట్ మధ్యప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్.

నాడు కూడా చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయారు. 23 ఏళ్ల తర్వాత చంద్రకాంత్ కోచ్‌గా ఉన్న మధ్యప్రదేశ్ జట్టు ట్రోఫీని కైవసం చేసుకోవడంతో స్టేడియంలోనే ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఇక మధ్యప్రదేశ్ రంజీ విజేతగా నిలవడం పట్ల ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ అయితే పట్టరాని ఆనందానికి గురయ్యారు. హెలికాప్టర్ లో పర్యటనకు బయల్దేరిన ఆయన.. అందులోంచే హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ''మధ్యప్రదేశ్ జీత్ గయా..బహుత్ బహుత్ బదాయి..'' అంటూ స్పందించారు.

సర్ఫరాజ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్.. కెరీర్ కు ఊపిరి ఈ సారి రంజీట్రోఫీ ముంబై బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ కెరీర్ కు ఊపిరి పోసింది. అతడు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. 12 ఏళ్ల కిందట 12 ఏళ్ల వయసులో 439 పరుగులు చేసి సంచలనం రేపిన సర్పరాజ్ పై ఎన్నో అంచనాలున్నాయి. అండర్ 19 ప్రపంచ కప్ లోనూ అదరగొట్టి టీమిండియా తలుపు తడతాడని భావించిన సర్ఫరాజ్ ఆ తర్వాత పూర్తిగా వెనుకబడ్డాడు. ఫిట్ నెస్ ఫామ్ ప్రవర్తనా లోపంతో కెరీర్ ను సందిగ్ధంలో పడేసుకున్నాడు. మధ్యలో ఉత్తరప్రదేశ్ కు రంజీ ఆడాడు.

అయితే తర్వాత తప్పులు తెలుసుకుని సరైన దారి పట్టాడు. ఈ ఏడాది కాస్త ఆలస్యంగా ముంబై జట్టులోకి వచ్చిన అతడు అదరగొట్టాడు. ఓ ట్రిపుల్ సెంచరీ సహా.. సీజన్ లో 982 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా మిడిలార్డర్ కు పోటీదారుల్లో ఒకడిగా మారాడు. కాగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా మధ్య ప్రదేశ్ ఓపెనర్ శుభమ్ శర్మ ఎంపికయ్యాడు. ఫైనల్లో అతడు 11630 పరుగులు చేశాడు.