మద్దాలి శివారెడ్డి ఇక్కడ.. పార్లమెంట్లో దుమ్మురేపుతున్న రవికిషన్

Sun Oct 18 2020 19:30:59 GMT+0530 (IST)

Maddali Shivareddy here .. Ravikishan in Parliament

రేసుగుర్రం చిత్రంలో ‘మద్దాలి శివారెడ్డి’ గా తెలుగు తెరకు పరిచయమైన భోజ్‌పురి సూపర్‌స్టార్ రవికిషన్ ప్రస్తుతం పార్లమెంట్లో ఆకట్టుకొనే ప్రసంగాలు చేస్తున్నాడు. ఓ నటుడిగానే కాక రాజకీయనాయకుడిగా కూడా రాణిస్తున్నాడు. ప్రస్తుతం అతడి ప్రసంగాలు పార్లమెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రవికిషన్ సినీరంగానికి పార్లమెంట్‌కు ఎలా  రాగలిగాడో.. అతడి జీవిత ప్రస్థానమెమిటో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం..బాల్యం ఎలా గడిచిందంటే


ముంబయిలోని శాంతాక్రూజ్‌లో రవీంద్ర శ్యామ్‌నారాయణ్ శుక్లా అలియాస్ రవి కిషన్ జన్మించాడు. రవికిషన్ తండ్రి ఓ గుడిలో  పూజారిగా ఉండేవాడు. దాంతోపాటు సోదరుడితో కలిసి పాలవ్యాపారం చేసేవాడు. అనంతరం వ్యాపారంలో నష్టం రావడంతో యూపీలోని సొంతూరు జౌన్‌పూర్‌కి వెళ్లిపోయాడు. అయితే ముంబైలో పెరిగిన రవికిషన్‌కు ఆ పల్లెటూరు నచ్చేది కాదు. స్కూల్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదట.  

అమ్మ ఇచ్చిన డబ్బుతో ముంబై ట్రైన్ ఎక్కాడు..

రవికి పదిహేడేళ్ల వయస్సున్నప్పుడు వాళ్ల అమ్మ ఇచ్చిన అయిదు వందల రూపాయల తీసుకొని  ముంబయికి ట్రైన్ ఎక్కాడు. చిన్నప్పుడు నివసించిన ఇంటికే వెళ్లాడు. స్నేహితుల సహాయంతో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 1992లో ‘పీతాంబర్’ అనే ఓ బీగ్రేడ్ బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే అప్పడే భోజ్‌పురిలో అవకాశం వచ్చింది. అక్కడ సూపర్ స్టార్ అయ్యాడు.  సల్మాన్‌ఖాన్ ‘తేరేనామ్’తో హిందీలోనూ మంచి పేరుతెచ్చుకున్నాడు. హిందీ బిగ్‌బాస్ 1లో సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. రియాల్టి షోలలో కూడా చేశాడు. బిజీ స్టార్ అయ్యాడు. వెనక్కి చూడాల్సిన అవసరమే రాలేదు.

భోజ్‌పురి హిందీ తెలుగు కన్నడం గుజరాతీ తమిళం... ఇలా పలు భాషల్లో ఇప్పటికి దాదాపు 400 చిత్రాల్లో నటించి చక్కటి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఏ పాత్ర అయినా అందులో పూర్తిగా వొదిగి పోవడమే రవికిషన్ నైజం. అదే అతడిని ఇంకా సినిమాల్లో నిలబెట్టింది. 

స్నేహితురాలు ప్రీతిని ప్రేమవివాహం చేసుకున్నాడు రవి కిషన్. ఈ జంటకు ముగ్గురు కూతుళ్లు ఒక బాబు.

రాజకీయాల్లోకి ఎంట్రీ..


రవికిషన్ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున తన జౌన్‌పూర్ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరవాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. మొన్నటి లోక్‌సభ ఎన్నికలకు గోరఖ్‌పూర్ నుంచి పోటీచేసి ఘనవిజయం సాధించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆప్తుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఇప్పడు పార్లమెంట్లో తన స్పీచ్‌తో అదరగొడుతున్నాడు.