మైసూరారెడ్డి మౌనమేల?

Mon Jul 19 2021 08:01:19 GMT+0530 (IST)

MV Mysura Reddy in silence?

మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం.. పలు మార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు రాజ్యసభ ఎంపీగానూ పనిచేసిన సీనియర నేత ఎంవీ మైసూరా రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిణామాలపై స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ రాయలసీమ పరిరక్షణ సమితి  నేత మైసూరా రెడ్డి మాత్రం రాయలసీమకు అన్యాయం జరిగేలా ప్రస్తుత పరిణమాలు ఉన్నప్పటికీ ఈ వివాదాన్ని పట్టించుకోనట్లు ఉండడం చర్చనీయాంశంగా మారింది.వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మైసూరా రెడ్డి కాంగ్రెస్ పార్టీతో 25 ఏళ్ల పాటు కొనసాగారు. ఆ సమయంలోనే ఎమ్మల్యేగా పలుమార్లు గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరి రాజ్యసభకు వెళ్లారు. 2012లో రాజ్యసభ ఎంపీగా పదవీకాలం ముగిసిన తర్వాత వైఎస్ఆర్ సీపీ పార్టీలో చేరారు. జగన్‌కు అండగా ఉండేందుకు సిద్ధమయ్యారు. కానీ మూడేళ్ల తర్వాత జగన్‌కు దూరమైన ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో ఆక్టివ్‌గా లేరనే విషయం స్పష్టమవుతోంది. గతంలో జగన్ కేసీఆర్ కలిసి గోదావరి జలాలను రెండు రాష్ట్రాలు ఉపయోగించుకుందామని చర్చించుకున్నపుడు ఆ ప్రతిపాదనను మైసూరా రెడ్డి స్వాగతించారు. సీమకు గోదావరి జలాలు మాత్రమే శరణ్యమని అప్పుడు ఆయన పదేపదే చెప్పారు. కానీ ఇప్పుడు మౌనం వహించారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మైసూరా రెడ్డి మొదటి నుంచి నోరు మెదపడం లేదు. పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంపునకూ ఆయన సుముఖంగా లేరనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో సమావేశాలు పెడుతున్న ఆయన జల వివాదంపై మాత్రం స్పందించడం లేదు. ముఖ్యంగా తెలంగాణ తీరును ఏపీ మొత్తం వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆయన మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జగన్‌కు అండగా నిలవాల్సిన ఆయన నోరు మెదపడం లేదు. దీంతో ఆయన వైఖరి సరికాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీమ కోసమైనా మైసూరారెడ్డి ముందుకు వచ్చి స్పందించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.