Begin typing your search above and press return to search.

ఎంపీలూ.. ఎపుడు ఆలోచిస్తారు... ?

By:  Tupaki Desk   |   3 Dec 2021 9:30 AM GMT
ఎంపీలూ..  ఎపుడు ఆలోచిస్తారు... ?
X
దేశంలో రాజకీయం ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా కుర్చీ చుట్టే రాజకీయాలు నడుస్తాయి. కానీ దానితో పాటే అనేక ఇతర విషయాలు కూడా ఉంటాయి. తాము పుట్టిన గడ్డకు, రాష్ట్రానికి న్యాయం చేయాలన్న ఆశ, ధ్యాస చాలా మందిలో ఉంటుంది. ఎంపీ పదవి అంటే దర్జా మాత్రమే కాదు, ఒక బాధ్యత. అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు. అలా ప్రజా ప్రతినిధులు ప్రశ్నించాలి, వీలుంటే నిగ్గదీయాలి. అప్పటికీ దారికి రాకపోతే సభలో రభస చేసైనా తమ వైపు ఫోకస్ ఉండేలా చూసుకోవాలి. తమ ప్రాంత సమస్యలను సాకారం చేసుకోవాలి.

మరి ఈ సోయి ఏపీ ఎంపీలకు ఉందా అంటే జవాబు నిరాశగానే ఉంటుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. అన్ని చోట్ల ఎంపీలు తమ రాష్ట్రం గురించి అక్కడి సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు. ముందు ఒంటరిగా వేలైతే ఇతర పార్టీలను కలుపుకుని ముందుకు పోతున్నారు. అంతవరకూ ఎందుకు పొరుగున ఉన్న తెలంగాణా ఎంపీలైతే వరి ధాన్యం కొనుగోలు మీద కేంద్రాన్ని గట్టిగా అడుగుతున్నారు. గత అయిదు రోజులుగా టీయారెస్ ఎంపీలు ఉభయ సభల్లో చేస్తున్న ఆందోళనతో హైలెట్ అవుతున్నారు.

సమస్య అన్నది కేంద్ర పెద్దలకు బాగానే చేరింది. వారిలో వేడి కూడా పుట్టింది. మరి ఏపీ ఎంపీలు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్నకు సమాధానం సులువే. వారు కేవలం ప్రశ్నల వరకే పరిమితం అవుతున్నారు. ఈ ప్రశ్నలకు కేంద్రం నింపాదిగా బదులిస్తోంది. అక్కడితీ కధ ముగుస్తోంది. వైసీపీకి లోక్ సభలో 22 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో ఆరుగురు ఉన్నారు. టీడీపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. మరి ఏపీ సమస్యల మీద వీరు గట్టిగా కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారా అంటే అసంతృప్తే జవాబుగా ఉంటోంది.

నిజానికి ఏపీకి సమస్యలు లేవా. అంటే ఎన్నో అని చెప్పాలి. లేటెస్ట్ గా తీసుకుంటే బంగారం లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ చేయాలని కేంద్రం చూస్తోంది. దాని మీద పెద్దగా ఆందోళన చేసింది లేదు, ఇక పోలవరం ప్రాజెక్ట్ కి మేజర్ కంపోనెంట్ అయిన నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారమే పెద్ద ఎత్తున ఉంది. ఆ నిధులను ఇవ్వమని కేంద్రం చెబుతోంది. అంతే కాదు 2014 నాటి లెక్కల ప్రకారమే పోలవరం నిర్మాణ ఖర్చు భరిస్తామని అంటోంది. అది కూడా పెట్టిన ఖర్చులో నాలుగవ వంతునే రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఏడేళ్లుగా పోలవరం నత్తనడక నడుస్తోంది.

మరి దాని విషయం ప్రస్థావించి కేంద్రం నుంచి మొత్తం నిధులను తెప్పించుకొనే పోరాటం అధికార విపక్ష ఎంపీలు చేస్తున్నారా అంటే లేదు అనే చెప్పాలి, ఇక విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయం లో కూడా ఇదే విధంగా సీన్ ఉంది. కేంద్రం అందుకే ఏపీని పెద్దగా పట్టించుకోవడంలేదా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. రాజకీయాలు ఎలా ఉన్నా ఏపీకి సంబంధించి అటు వైసీపీ, ఇటు టీడీపీ, ఇంకా బీజేపీలో ఉన్న ఎంపీలు కలసి కేంద్రాన్ని నిలదీస్తే రాష్ట్ర ప్రయోజనాలు పరిష్కారం అవుతాయి. కానీ మొక్కుబడిగా కేంద్రాన్ని ఫలనా అడిగామని చెప్పుకోవడానీకే తప్ప దీని వల్ల కేంద్ర పెద్దలు ఏమైనా ఓకే చెబుతున్నారా అన్నది ఆలోచిస్తే మాత్రం ఆవేదన కలుగుతోంది. మరి ఎపుడూ రాజకీయాలూ, బీజేపీకి నొప్పి కలిగించని పనులే తప్ప రాష్ట్రం కోసం ఎపుడు ఆలోచిస్తారు ఎంపీలూ అంటే సమాధానం వస్తుందా.