Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురి ఆశల మీద నిప్పులు పోస్తున్న ఎంపీ గారు...?

By:  Tupaki Desk   |   30 Jan 2023 9:22 AM GMT
ఆ ముగ్గురి ఆశల మీద నిప్పులు పోస్తున్న ఎంపీ గారు...?
X
ఉన్నది ఒక్కటే సీటు. దాని మీద టైట్ ఫైట్. ఆ సీటు కోసం పోటీల మీద పోటీలు. సొంత పార్టీలోనే అందరికీ ప్రత్యర్ధులుగా మారుస్తోంది. ఇంతకీ ఆ సీటూ దాని ఫేటూ ఏంటో ఎవరికీ అర్ధం కావడంలేదు. విశాఖ సిటీ నడిబొడ్డున ఉన్న ఆ హాట్ సీటు పేరు విశాఖ తూర్పు. ఆ సీటు ఇపుడు స్వీట్ గా ఉంది అందరికీ. విశాఖ తూర్పు 2009 లో ఏర్పడింది.

అప్పటి నుంచి ఈ రోజుదాకా ముమ్మారు ఆ సీట్లో తెలుగుదేశమే గెలుస్తూ వచ్చింది. ఒకే ఒక్క నాయకుడు వెలగపూడి రామక్రిష్ణబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి ఆయనకే టికెట్ అనేశారు చంద్రబాబు. దాంతో వెలగపూడి మళ్లీ ఆ సీటుని గెలిపించుకుని వస్తారు అన్న ధీమాతో టీడీపీ ఉంది. ఆ సీట్లో రెండు సార్లు వెలగపూడిని ఢీ కొట్టి ఓడింది వైసీపీ.

ఈసారి అయినా గెలవాలని చూస్తోంది. దాంతో అనేక ప్రయోగాలు చేస్తోంది. ఏకంగా విశాఖ ఎంపీని వెలగపూడి సొంత సామాజికవర్గం నేతనే దించేస్తే పోలా అని చూస్తోంది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తూర్పులోనే ఉంటారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత. అంగబలం, అర్ధంబలం నిండుగా ఉన్న వారు. వెలగపూడితో ఢీ కొట్టే కెపాసిటీ బాగానే ఉంది. దాంతో ఆయన్ని తొందరలోనే విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జిగా నియమిస్తారు అని అంటున్నారు.

అయితే ఈ సీటు మీద ఒకరు కాదు ముగ్గురు వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. వారిలో ఒకరు వీఎమ్మార్డీయే చైర్ పర్స్న అక్రమాని విజయనిర్మల. ఆమె ఇపుడు ఇంచార్జిగా ఉన్నారు. ఆమె 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే చివరి నిముషంలో టికెట్ కన్ ఫర్మ్ కావడం వల్లనే అలా జరిగింది కానీ ఈసారి టికెట్ ఇస్తే గెలుపు ఖాయమని ఆమె అంటున్నారు.

ఇక 2014లో వైసీపీ టికెట్ మీద పోటీ చేసి 2019లో చివరి నిముషం దాకా ఆయనే అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వంశీక్రిష్ణ శ్రీనివాస్ యాదవ్ కూడా సై అంటున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చినా కూడా ఎమ్మెల్యేకే నా ఓటు అంటున్నారు. ఎమ్మెల్యే అనిపించుకోవాలని, ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ ఇద్దరూ కాకుండా మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కూడా రేసులో ఉన్నారు.

ఆమె మేయర్ గా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఉన్నంతలో జనాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అధినాయకత్వం వద్ద కూడా ఆమెకు మంచి పేరు ఉంది. చిత్రమేంటి అంటే ఈ ముగ్గురూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. ఈ ముగ్గురూ కూడా రేసులో ఉండడంతో ఎవరికీ మరొకరు అంటే పడడంలేదు. దాంతో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన రెండు వర్గాలు సహకరించకపోగా ఎదురు తిరుగుతాయని అధినాయకత్వం కంగారు పడుతోంది. దాంతో ఈ ముగ్గురూ కాకుండా ధీటైన అభ్యర్థి గా ఎంపీ గారినే దించితే ముగ్గురునీ దారిలోకి తెచ్చుకుని సహకరించుకునేలా చేసుకుంటారు అని అంటున్నారు.

దాంతో చాలా తొందరలోనే విశాఖ తూర్పునకు ఎంవీవీ ఇంచార్జిగా వస్తారని అంటున్నారు. ఆయన అంటే జగన్ కి మంచి అభిప్రాయం ఉంది. ఆయన అంగబలం అర్ధం బలం మీద హై కమాండ్ కి గురి ఉంది అని అంటున్నారు. సో తూర్పులో వైసీపీ మార్పులకు చూస్తోంది. దాని వల్ల ఫలితాలు ఎలా వస్తాయో చూడాలని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.