Begin typing your search above and press return to search.

పోలవరం నిర్వాసితులకు 16 వేల కోట్లు ఇవ్వండి

By:  Tupaki Desk   |   10 Dec 2019 3:56 PM GMT
పోలవరం నిర్వాసితులకు 16 వేల కోట్లు ఇవ్వండి
X
పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం, పునరావాస, పునఃనిర్మాణ పనుల కోసం తక్షణమే 16 వేల కోట్లు రూపాయలు విడుదల చేయాలని వి.విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నీటి సంక్షోభం నివారణ కోసం జాతీయ ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన ఆవశ్యకతపై మంగళవారం రాజ్యసభలో కాలింగ్‌ అటెన్షన్‌ మోషన్‌ పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌పై జల శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ నుంచి ఆయన కొన్ని వివరణలు కోరారు.

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం ముంపునకు గురయ్యే గ్రామాల నుంచి వేలాది మంది రైతులు - దళితులు - గిరిజనుల కుటుంబాలను ఖాళీ చేయించడం జరిగిందని అన్నారు. ప్రాజెక్ట్‌ నిర్వాసితులైన వారందరికీ పునరావాసం కల్పించాలి. పునఃనిర్మాణ కార్యకలాపాలు చేపట్టాలి. ఇందుకోసం 16 వేల కోట్ల రూపాయలు తక్షణం అవసరం. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనా వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌ పై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవడానికి ముందుగా ఈ 16 వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయమని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గత అక్టోబర్‌ 5న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీకి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఎప్పటిలోగా ఈ నిధులను విడుదల చేస్తారో తెలపవలసిందిగా జల శక్తి మంత్రిని కోరారు.

పోలవరం ప్రాజెక్ట్‌ కు సంబంధించి సవరించిన అంచనా వ్యయంతో రూపొందించిన డీపీఆర్‌ ను కేంద్ర జల సంఘం ఆమోదించింది. తదుపరి డీపీఆర్‌ ను ఆమోదం కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించింది. దీనిపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేసేందుకు మంత్రిత్వ శాఖ రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికి మూడు - నాలుగుసార్లు సమావేశమైంది. అసలు ఈ కమిటీకి నిర్దేశించిన విధి విధానాలేమిటి - నివేదిక సమర్పించడానికి విధించిన కాల పరిమితి ఎంత, ఎప్పటిలోగా ఈ కమిటీ నివేదికను సమర్పిస్తుందంటూ శ్రీ విజయసాయి రెడ్డి జల శక్తి మంత్రిని వివరణ అడిగారు.

ఏపీ ముఖ్యమంత్రి 2021 నాటికల్లా పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్నిపూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. అందువలన సవరించిన అంచనా వ్యయంకు సంబంధించిన డీపీఆర్‌ను జాప్యం లేకుండా ఆమోదించాలి. అలాగే నిధుల విడుదల కూడా త్వరితగతిన జరగాలి. నిధుల విడుదల సాఫీగా జరిగేందుకు జల శక్తి మంత్రిత్వ శాఖ వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా అని కూడా ఆయన ఆరా తీశారు. పోలవరం కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం 2,343 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించిన విషయం వాస్తవమేనా? పోలవరం హైడల్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించడానికి ముందుగానే అప్పటి ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్ పొందిన నవయుగ కంపెనీకి 787 కోట్లు ముందస్తుగా చెల్లించినట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ధారించింది. ఈ విధమైన అక్రమ చెల్లింపులను కాంట్రాక్టర్ నుంచి తిరిగి వసూలు చేయడానికి జల శక్తి మంత్రిత్వ శాఖ ఎలాంటి చర్యలను ప్రతిపాదిస్తోంది అని ఆయన ప్రశ్నించారు.