Begin typing your search above and press return to search.

ప్రత్యర్థులు అయిపోయారా? సొంతోళ్లు కొట్టుకుంటున్నారా జగన్?

By:  Tupaki Desk   |   28 Jan 2023 9:39 PM GMT
ప్రత్యర్థులు అయిపోయారా? సొంతోళ్లు కొట్టుకుంటున్నారా జగన్?
X
ఏపీ అధికారపక్షంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ చూడనంతగా జగన్ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ నేతలు.. ఛోటా నేతలు.. కార్యకర్తలు ఎంతలా చెలరేగిపోతున్నారో చూస్తున్నదే. నిజానికి.. ఈ తీరుకు సీఎం కమ్ వైసీపీ అధినేత ముందే కట్టడి చేసి ఉంటే బాగుండేది. కానీ.. ప్రత్యర్థులపై ఎంతలా విరుచుకుపడినా.. పెద్దగా పట్టించుకోనట్లుగా ఉన్న తీరు.. వారిలో మరింత ఉత్సాహాన్ని పెంచటమే కాదు.. ఏపీలోఎప్పుడూ చూడని రాజకీయ సన్నివేశాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.

అధికారం చేతికి వచ్చి మూడున్నరేళ్లు దాటిపోయి.. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రానున్న వేళ.. అధికార పార్టీలో కొత్త తరహా పరిణామాలు ఇటీవల వరుస పెట్టి చోటు చేసుకుంటున్నాయి. ఇంతకాలం రాజకీయ ప్రత్యర్థుల మీద విరుచుకుపడిన వైసీపీ వర్గాలు.. ఇప్పుడు తమలో తాము కొట్టేసుకోవటం ఎక్కువైంది. తాజాగా క్రిష్ణా జిల్లాలో చోటు చేసుకున్న తాజా పరిణామాలే నిదర్శనంగా చెప్పొచ్చు. నాగాయలంకలో వైసీపీ శ్రేణుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.

నాబార్డు ఛైర్మన్ నాగాయలంకకు వచ్చిన సందర్భంగా ఆ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వచ్చారు వైసీపీ ఎంపీ బాలశౌరి. అయితే.. బాలశౌరి వర్గీయులపై స్థానిక అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు వర్గీయులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చెప్పులతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. పోలీసులు అడ్డుకున్నా.. వివాదం సద్దుమణగలేదు. ఇరు వర్గాల వారు చెలరేగిపోవటంతో పరిస్థితి చేయి దాటిపోయిన పరిస్థితి నెలకొంది. పోలీసులు ఉన్నా కూడా.. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా.. అవేమీ పట్టించుకోకుండా చెలరేగిపోయిన అధికార పార్టీ నేతల తీరు అక్కడ షాకింగ్ గా మారింది.

ఇంతకాలం ప్రత్యర్థులపై పోరు చేసే వైసీపీ వారు.. ఇప్పుడు వాళ్లలో వాళ్లే కొట్టుకోవటమా? అన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఎమ్మెల్యే వర్గీయులు వర్సెస్ ఎంపీ వర్గీయుల మధ్య జరిగిన పోరులో పెద్ద ఎత్తున దెబ్బలాట సాగటమే కాదు.. దీనికి సంబంధించిన వీడియోలు తీస్తున్న జర్నలిస్టులపై కూడా వైసీపీ నేతలు దాడి చేయటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తగా మారింది. చూస్తుంటే.. మేం కొట్టుకుంటాం. అది మా పంచాయితీ. మీరెవరూ వీడియోలు తీసుకోవటానికి అన్నట్లుగా వారి తీరు ఉందంటున్నారు. మొత్తంగా చూస్తే.. ఇటీవల కాలంలో పలు జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా జగన్ కళ్లు తెరిచి.. పార్టీలోని వర్గపోరుకు చెక్ పెట్టకపోతే.. రానున్న రోజుల్లో ఇలాంటి పరువు తక్కువ పనులు మరిన్ని చోటు చేసుకోవటం ఖాయమని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.