సీఎంకు లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు !

Tue Jul 14 2020 18:45:33 GMT+0530 (IST)

MP Raghuramkrishnan Raju writes letter to CM Jagan!

ఎంపీ రఘురామకృష్ణరాజు గత కొంతకాలంగా స్వపక్షంలో విపక్షంలా మారి ... వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీలో ఈయన వ్యహారం పై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈయనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీలందరూ కలిసి లాక్ సభ స్పీకర్ ను కలిసి ఎంపీ పై ఫిర్యాదు కూడా చేసారు. అలాగే వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యే లు ఎంపీ పై కేసులు కూడా నమోదు చేశారు. ఈ వ్యవహారం ఇలా సాగుతున్న నేపథ్యంలోనే తాజాగా ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. అయితే పార్టీపరమైన విషయాలు కాకుండా రాష్ట్రంలో అష్టకష్టాలపాలవుతున్న భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.కరోనా ను అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ తో  భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేసిందని కొన్ని నెలలుగా ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తన లేఖలో సీఎం జగన్ కి వివరించారు.  రాష్ట్రంలో 20లక్షల 64 వేల భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారని  వారిలో 10లక్షల 66 వేల మంది కార్మికుల పేర్లను మాత్రమే ఆధార్ తో లింక్ చేశారని మిగిలిన వారి పేర్లు వెంటనే లింక్ చేసేలా చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు సీఎం ను కోరారు.  రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య కాలంలో బిల్డర్స్ నుంచి సంక్షేమ నిధి రూపేణా రూ. 1364 కోట్లు వసూలు చేసిందని అయితే ఇప్పటి వరకూ రూ.330 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మిగిలిన వెయ్యి కోట్ల నిధుల నుంచి ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి రూ. 5 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని ఏపీ సీఎం జగన్ కు రాసిన లేఖలో రఘురామ కృష్ణంరాజు కోరారు.