Begin typing your search above and press return to search.

రాజకీయ పార్టీల మద్దతు కావాలట

By:  Tupaki Desk   |   7 July 2022 4:42 AM GMT
రాజకీయ పార్టీల మద్దతు కావాలట
X
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకి అర్జంటుగా రాజకీయపార్టీల మద్దతు కావాలట. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. తనను హత్యచేయటానికి జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించిన ఎంపీ తనను అంతం చేస్తే జనాలు చూస్తు ఊరుకోరంటు వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారాయణ, రాఘవులు, తులసిరెడ్డి అందరినీ పేరుపేరునా రిక్వెస్టు చేసుకున్నారు.

పై పార్టీల నేతలంతా తనకు మద్దతుగా నిలబడాలని రిక్వెస్టుచేసిన ఎంపీ మరి బీజేపీ పేరు మాత్రం ఎందుకు ప్రస్తావించలేదో తెలీటంలేదు. తాను జూలై 4వ తేదీన భీమవరంకు చేరుకునేందుకు నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ లో బయలుదేరిన విషయాన్ని చెప్పారు.

అయితే గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో తాను ప్రయాణిస్తున్నభోగీని కాల్చేసేందుకు జగన్ కుట్రపన్నినట్లు ఆరోపించారు. రైలుభోగీని కాల్చేసి తనను చంపాలని ప్లాన్ చేసినట్లు జగన్ పై ఆరోపణలు చేసిన ఎంపీ అందుకు ఆధారాలను మాత్రం బయటపెట్టలేదు.

సరే జగన్ పై తానుచేస్తున్న పోరాటానికి మద్దతుగా పార్టీల నేతలంతా తనకు అండగా నిలవాలని విజ్ఞప్తిచేశారు. నిజానికి ఇక్కడ అర్ధంకాని విషయం ఏమిటంటే జగన్ పై ఎంపీ ఏ విధమైన పోరాటం చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు. ఎక్కడో ఢిల్లీలో కూర్చుని ప్రతిరోజు రచ్చబండ అనే కార్యక్రమం ఒకటిపెట్టుకుని జగన్ను అమ్మనాబూతులు తిడుతుంటారు. ఇదే సమయంలో ప్రభుత్వానికి, జగన్ కు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారంతే.

దీన్నే జగన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్లు ఎంపీ భ్రమపడుతున్నారేమో. ఇలాంటి పోరాటం చేసే వ్యక్తికి ఎవరైనా ఏ రకంగా సాయం చేయగలరు ? ఏ రూపంలో మద్దతివ్వగలరు ?

ఢిల్లీలో కూర్చోవటం కాకుండా నేరుగా నరసాపురం నియోజకవర్గానికి వచ్చి ప్రభుత్వానికో లేదా జగన్ కు వ్యతిరేకంగానో ఆందోళనలు చేస్తే దాన్ని పోరాటమంటారు. ఒకవేళ నరసాపురంకు వెళ్ళలేకపోతే వైజాగ్, విజయవాడ, తిరుపతి ఏదో ప్రాంతంలో ఆందోళనలు నిర్వహిస్తే మిగిలిన పార్టీలు కూడా మద్దతిచ్చే అవకాశముంటుంది.