వైసీపీ ఎంపీ విజయసాయి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ పిటీషన్

Tue Aug 03 2021 22:00:01 GMT+0530 (IST)

MP Raghurama petitions to cancel YCP MP Vijayasai  bail

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన పార్టీ అగ్రనేతలకు నిద్రలేకుండా చేస్తున్నారు. తన చర్యలతో చికాకు పెడుతూనే ఉన్నాడు. వైసీపీ చీఫ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే ఎంపీ రఘురామ సీబీఐకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతుండగా.. తాజాగా మరో అస్త్రం సంధించారు.మంగళవారం ఎంపీ రఘురామకృష్ణంరాజు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో ఈసారి విజయసాయిరెడ్డి మీద పిటీషన్ దాఖలు చేశారు. విజయసాయిరెడ్డి బెయిల్ ను కూడా రద్దు చేయాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసి సంచలనం రేపారు.

సీబీఐ దాఖలు చేసిన క్విడ్ ప్రో కో కేసులలో జగన్ ఏ1 నిందితుడిగా ఉండగా.. విజయసాయిరెడ్డి ఏ2 నిందితుడిగా ఉన్నాడని.. అందుకే విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి ఎంపీగా ఉన్నారని.. ఆయన కేంద్ర హోంమంత్రి ఆర్థిక మంత్రిత్వశాఖ మంత్రి ఉన్నతాధికారులతో కలుస్తారని.. వారితో సన్నిహిత సంబంధాలు నెరుపుతారని.. వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేసి కేసులు నీరుగారిపోయేలా చేయగలరని రఘురామరాజు తన పిటీషన్ లో కోర్టు దృష్టికి తెచ్చారు.

విజయసాయిరెడ్డి తన చర్యలతో ప్రత్యక్షంగా.. పరోక్షంగా సాక్ష్యులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారని.. సాక్షులలో భయం భక్తి భావాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారని రఘురామ రాజు తన పిటీషన్ లో పేర్కొన్నారు.

జగన్ అక్రమాస్తుల కేసుల్లో ప్రధాన దర్యాప్తు అధికారిగా ఉన్న అధికారిని సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా నియమించవద్దని కోరుతూ ఎంపీ విజయసాయి తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారని రఘురామ రాజు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేసుల స్వేచ్ఛా న్యాయమైన విచారణ ప్రక్రియకు ఈ చర్య విఘాతం కలిగిస్తుందని రఘురామ రాజు తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఇదే రఘురామ జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు పూర్తి అయ్యాయి. ఆగస్టు 25న కోర్టు తీర్పును వెలువరించనుంది.