Begin typing your search above and press return to search.

ఎంపీకి సీన్ అర్ధమైపోయిందా ?

By:  Tupaki Desk   |   15 Sep 2021 4:20 AM GMT
ఎంపీకి సీన్ అర్ధమైపోయిందా ?
X
వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజుకు సీన్ అర్ధమై పోయినట్లుంది. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పు చెప్పే ఒక్కరోజు తెలంగాణా హైకోర్టులో తాజాగా ఓ కేసు వేయటమే దీనికి నిదర్శనం. ఈనెల 15వ తేదీ అంటే బుధవారం పై ఇద్దరి బెయిల్ రద్దు విషయంలో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పబోతున్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి జగన్ బెయిల్ రద్దు విషయంలో ఎప్పుడో తీర్పు రావాల్సుంది. కానీ జగన్+విజయసాయి కేసుల్లో ఒకేసారి తీర్పు చెప్పాలని జడ్జి నిర్ణయించటంతోనే తీర్పు ఆలస్యమైంది.

15వ తేదీన తీర్పు రాబోతుండగా ఒక్కరోజు ముందు అంటే 14వ తేదీన తెలంగాణ హైకోర్టులో ఎంపీ ఓ పిటిషన్ వేశారు. దేనికంటే బెయిల్ రద్దు విచారణపై తీర్పు చెప్పకుండా నిలిపేయాలట. బెయిల్ కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలని ఎంపీ కోరటమే విచిత్రంగా ఉంది. తన తాజా పిటిషన్ కు కారణం ఏమిటంటే జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు చెప్పబోయే రోజున సాక్షి మీడియాలో బెయిల్ రద్దుకు ఎంపి వేసిన పిటీషన్ను కోర్టు కొట్టేసిందని వచ్చింది. నిజానికి సాక్షి వెట్ సైట్లోనే కాదు ఎన్టీవీ లో కూడా బిగ్ బ్రేకింగ్ అంటు ఇదే విషయం ప్రముఖంగా వచ్చింది. అయితే వెంటనే ఆ న్యూస్ ఆగిపోయింది.

తర్వాత ఏమి జరిగిందో తెలీదు కానీ మళ్ళీ సదరు న్యూస్ ఏ మీడియాలోనూ కనబడలేదు. దాన్నే తన తాజా పిటిషన్ కు ఎంపీ ఆధారంగా చేసుకున్నారు. జడ్జి తీర్పు చెప్పకుండానే సాక్షి వెబ్ సైట్లో ఆ విషయం ఎలా వచ్చిందనేది ఎంపి లాజిక్. ఇదే విషయమై కోర్టు ధిక్కారం కేసు కూడా ఎంపి మరోటి వేశారు. నిజానికి జగన్+విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ అయిపోయింది. తీర్పు చెప్పడం మాత్రమే మిగులుంది.

అంటే ఇద్దరి బెయిల్ రద్దు పై తాను వేసిన కేసులను కోర్టు కొట్టేస్తుందనే అనుమానం ఎంపికి బలంగా ఉన్నట్లు అర్థమైపోతోంది. లేకపోతే తన పిటిషన్ను కోర్టు కొట్టేస్తే దాన్ని హైకోర్టులో చాలెంజ్ చేస్తానని గతంలోనే చెప్పారు. హైకోర్టు కూడా తన పిటీషన్ను కొట్టేస్తే సుప్రీం కోర్టుకు వెళతానని కూడా ఎంపి చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. మరలాంటిది సీబీఐ కోర్టును తీర్పే చెప్పకుండా అడ్డుకోవాలని పిటిషన్ వేయటంలో అర్ధమేలేదు. ఎంపీ తరపు లాయర్ వాదనలు విన్న జడ్జి ఫుల్ గా క్లాస్ పీకారు. ఊహాజనితంగా కేసులు వేయద్దని గట్టిగా హెచ్చరించారు.

విచారణ పూర్తయిన కేసుల్లో తీర్పు చెప్పకుండా ఎంతకాలమని ఎంపి అడ్డుకోగలరు ? విచారణంతా పూర్తయ్యేంత వరకు వెయిట్ చేసి తీరా తీర్పు చెప్పే ముందు రోజు అడ్డుకోవాలని చూడటమే విచిత్రం. అంటే ఇద్దరిపై బెయిల్ రద్దు పిటిషన్ విచారణ జరుగుతుండాలని మాత్రమే ఎంపి కోరుకుంటున్నట్లే ఉంది. ఏదేమైనా తన పిటీషన్ల పసలేదని ఎంపికే అర్ధమైపోయినట్లుంది. అందుకనే తీర్పు చెప్పకుండా అడ్డుకోవాలని తెలంగాణ హైకోర్టులో పిటీషన్ వేశారు.