రైతు పైకి దూసుకెళ్లిన ఎంపీ కాన్వాయ్‌లోని కారు - కాలికి గాయం

Sun Feb 23 2020 20:09:54 GMT+0530 (IST)

MP Nandigam Suresh Car Hits Amaravati Farmer

బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ కాన్వాయ్ లోని ఓ కారు రైతు కాలిపై నుండి వెళ్లింది. అమరలింగేశ్వరినికి మొక్కులు చెల్లించేందుకు వెళ్తున్న ఓ రైతు పైకి ఎంపీ కాన్వాయ్‌లోని కారు దూసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం అమరలింగేశ్వర స్వామి రథోత్సవం ఉంది. మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఆలయానికి వచ్చారు. ఈ క్రమంలో ఎంపీ సురేష్ కూడా ఆలయానికి వస్తున్నారు. వెలగపూడి - తుళ్లూరు తదితర గ్రామాలకు చెందిన రైతులు - మహిళలు కూడా మొక్కులు చెల్లించుకునేందుకు - రథోత్సవంలో పాల్గొనేందుకు ట్రాక్టర్లపై వచ్చారు.పోలీసులు వారిని ఆలయానికి దాదాపు రెండు కిలో మీటర్ల దూరంలో అడ్డుకున్నారు. నడిచి వెళ్లాలని సూచించారు. దీంతో రైతులు - మహిళలు ర్యాలీగా ఆలయానికి వెళ్తున్నారు. ఈ సమయంలో ఎంపీ కారు అటువైపుగా వచ్చింది. ఎదురుగా ఆర్టీసీ బస్సు వస్తోంది. బస్సును తప్పించే క్రమంలో ఎంపీ కాన్వాయ్‌లోని ఓ వాహనం రైతు కాలు పైకి ఎక్కింది. రైతు కాలికి తీవ్ర గాయమైంది.

తోటి రైతులు వెంటనే అతనిని ఆలయానికి - అటు నుండి ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. రైతుకు గాయమైన ఎంపీ కాన్వాయ్ ఆగకుండా వెళ్లిందని రైతులు మహిళలు మండిపడ్డారు. కాలు ఫ్రాక్చర్ అయినట్లుగా సమాచారం. తాము అమరలింగేశ్వరుడి వద్దకు వెళ్తుంటే తమ ట్రాక్టర్లు రెండు కిలో మీటర్ల దూరంలో నిలిపివేశారని అంత దూరం ఎలా నడుస్తామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని తాము ర్యాలీగా వెళ్తుంటే ఎంపీ కాన్వాయ్‌లోని కారు రైతు పైకి వెళ్లిందని చెబుతున్నారు. కాగా గాయపడిన రైతు తుళ్లూరు గ్రామానికి చెందిన తాడికొండ హనుమంతరావుగా తెలుస్తోంది.