Begin typing your search above and press return to search.

టీడీపీకి ఆ అలవాటు లేదట

By:  Tupaki Desk   |   26 Sep 2021 5:30 AM GMT
టీడీపీకి ఆ అలవాటు లేదట
X
శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొత్తగా ఓ విషయం చెప్పారు. అదేమిటంటే టీడీపీకి ప్రత్యర్ధులపై బురదచల్లే అలవాటు లేదని. తెలుగుదేశంపార్టీ ఏమి మాట్లాడినా తగిన ఆధారాలు లేకుండా అస్సలు మాట్లాడనే మాట్లాడదట. ఈ విషయాలు చెబుతునే ఎంపీ ప్రభుత్వం ఫుల్లుగా బురదచల్లేయటమే విచిత్రంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే విదేశాల్లో కూడా రాష్ట్రం ప్రతిష్ట దిగజారిపోతోందట. ఇదంతా ఎలా జరుగుతోందంటే కేవలం వైసీపీ నేతల వ్యవహార శైలివల్లేనని చెప్పారు.

జగన్ సీఎం అయ్యాక రాష్ట్రం అరాచకాంధ్రప్రదేశ్ గా మారిపోయిందట. ఎంపి ఇంత అర్జంటుగా ప్రభుత్వంపై బురదచల్లేయటానికి, ఏపి ప్రతిష్టగురించి బాధపడటానికి కారణం ఏమిటంటే గుజరాత్ లో పట్టుబడిన రు. 72 వేల కోట్ల విలువైన హెరాయినే కారణం. గుజరాత్ లో పట్టుబడిన హెరాయిన్ పై కనీస విచారణ జరపకుండానే దాంతో ఏపీకీ సంబంధం లేదని డీజీపీ ఎలా సర్టిఫికేట్ ఇస్తారని ఎంపి నిలదీశారు. ఏపీలో ఉన్న అడ్రస్ పేరుతోనే హెరాయిన్ దిగుమతి అయ్యిందని జాతీయ మీడియా కోడైకూస్తుంటే దాంతో సంబంధంలేదని డీజీపీ చెప్పటాన్ని ఎంపి తప్పుపట్టారు.

ఇక్కడ ఎంపి మరచిపోయిన విషయం ఏమిటంటే దాని అడ్రస్ విజయవాడలోని సత్యనారాయణపురంలోనే ఉందని డీజీపీ కూడా చెప్పారు. కానీ విజయవాడలోని అడ్రస్ కేంద్రంగా ఇప్పటివరకు ఎలాంటి డ్రగ్స్ వ్యాపారం జరగలేదన్నారు. జీఎస్టీ కోసమే విజయవాడలని అడ్రస్ ఇచ్చినట్లు రికార్డుల్లో ఉంది. ఈ మొత్తం విషయాన్ని దర్యాప్తు చేస్తున్నది కేంద్రప్రభుత్వంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు. ఈ దర్యాప్తులో ఏపీ పోలీసులకు ఎలాంటి సంబంధంలేదు.

దర్యాప్తు చేస్తున్న డీఆర్ఐ ఉన్నతాధికారులు కూడా విజయవాడ కేంద్రంగా డ్రగ్స్ వ్యాపారం జరుగుతున్నట్లు చెప్పలేదు. అయినా టీడీపీ నేతలు మాత్రం ఏపిలో వేల కోట్ల రూపాయల డ్రగ్స్ వ్యాపారం జరిగిపోతోందని, దీనికి తాడేపల్లి ప్యాలెస్ కు లింకులున్నట్లు ఆరోపణలు చేసేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ అంటే చంద్రబాబు అండ్ కో ఉద్దేశ్యం ఏమిటంటే జగన్ అని చెప్పటమే. దేశంలో ఎక్కడేమి జరిగినా వెంటనే దాన్ని జగన్ కు ముడేసి బురదచల్లేయటం బాగా అలవాటైపోయింది. అయినా తమకు ప్రత్యర్ధులపై బురదచల్లటం తెలీదని ఎంపి చెప్పటమే పెద్ద జోక్.

ఎక్కడో గుజరాత్ పోర్టులో పట్టుబడిన హెరాయిన్ వల్ల విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్ట దిగజారిపోతోందని ఎంపి చెప్పటంలో అర్ధమేలేదు. గుజరాత్ లో డ్రగ్స్ పట్టుబడిన కారణంగా ఏపి ప్రతిష్ట దిగజారిపోతే మరి పట్టుబడిన గుజరాత్ పరువు ఏమవ్వాలి ? గుజరాత్ నుండే ప్రధానమంత్రిగా ఎదిగిన నరేంద్రమోడి కూడా దేశంప్రతిష్టను దిగజారుస్తున్నట్లేనా ? ఎంపి చెప్పిందే కరెక్టయితే రాష్ట్రపరువు జగన్ వల్ల పోతే దేశం పరువు మోడి వల్లే పోతోంది కాదా ?

రాష్ట్ర ప్రతిష్ట గురించి ఇంత బాధపడిపోతున్న ఎంపి మరి పోతున్న దేశం ప్రతిష్టగురించి ఎందుకు ఆలోచించటంలేదు ? ఇదే విషయాన్ని మోడిని కూడా సూటిగా ప్రశ్నించచ్చు కదా. బురదచల్లటం తమకు అలవాటు లేదని చెబుతునే ఎంపి చేసిందేమిటో అందరికీ అర్ధమైపోతోంది. తమకు మద్దతిచ్చే మీడియాను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై బురదచల్లటమే టీడీపీ టార్గెట్ గా పెట్టుకున్నదన్న విషయం అందరికీ తెలుసు.