చంద్రబాబుతో జేసీ భేటీ...`రాజీ`నామాకు తెర?

Mon Jul 23 2018 17:35:32 GMT+0530 (IST)


అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయబోతున్నారన్న వార్త కొద్ది రోజులుగా హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానం తర్వాత జేసీ రాజీనామా చేస్తారని ఊహాగానాలు వచ్చిన విషయం విదితమే. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిని జేసీ....రాజీనామా చేసే తేదీని త్వరలోనే వెల్లడిస్తానని....మీడియాకు తప్పక తెలియజేస్తానని అన్నారు. తాను హఠాత్తుగా రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలనుకోవడం లేదని చాలాకాలంగా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీలో ఉండాల్సిన జేసీ అమరావతిలో ప్రత్యక్షమై అందరికీ షాకిచ్చారు. పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరైన జేసీ....సచివాలయంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో ఆ సమావేశం అనంతరం జేసీ `రాజీ`నామాపై ఓ క్లారిటీ వస్తుందని అంతా భావించారు. అయితే దాదాపు 20నిమిషాల భేటీ  అనంతరం మీడియాతో మాట్లాడిన జేసీ...మరోసారి తన రాజీనామాపై స్పష్టత నివ్వకుండానే వెళ్లిపోయారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడానని - కానీ ఏం మాట్లాడానో మీడియాకు చెప్పనని జేసీ తనదైన శైలిలో అన్నారు. అంతా సమసిపోయిందని తాను పార్లమెంట్‌కు హాజరవుతున్నానని తెలిపారు.జీసీతో చంద్రబాబు `రాజీ`నామా ....కొద్దిరోజులుగా కొనసాగుతున్నా నేపథ్యంలో నేటి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో విబేధాలు అనంతపురంలో అభివృద్ధిపనులు 2019 ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ల పంపిణీ వంటి అంశాలపై తనకున్న అభ్యంతరాలను బాబుతో జేసీ చర్చించబోతున్నారని మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. అయితే చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జేసీ...తన రాజీనామా గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. చంద్రబాబుతో ఏం మాట్లాదింది వెల్లడించనని తేల్చి చెప్పారు. సొంత భార్య మినహా... దేశంలో ఎవరిమీద అలిగిన ప్రయోజనం ఉండదని అలగడానికి పార్లమెంట్ కు వెళ్లకపోవడానికి సంబంధం లేదని జేసీ అన్నారు. దేశంలో రాజకీయ పరిస్థితులు బాగాలేవని గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగుతుందన్నారు.  రాష్ట్రానికి న్యాయం జరగాలని...మోదీ ఉన్నంతకాలం కేంద్రంపై పోరాడుతూనే ఉంటామని చెప్పారు. రాజకీయాల్లో అతివృష్టి - అనావృష్టి ఉండరాదని తనకు తానే సర్దిచెప్పుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై సీడబ్ల్యూసీ తీర్మానం ఒట్టిమాట అని తేల్చేస్తూ.. అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమర్శించారు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం పోరాటం చేయాల్సిందే అని వ్యాఖ్యానించారు. అయితే రాజీనామా వ్యవహారంపై జేసీకి చంద్రబాబు హితబోధ చేశారని - దీంతోనే జేసీ ఆ ఆలోచనను ప్రస్తుతానికి విరమించుకున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి.