ఎస్పీ మాటలకు భిన్నంగా సీసీ కెమేరా దృశ్యాలు

Tue May 24 2022 17:00:01 GMT+0530 (IST)

MLC Former Driver Murder Case

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారటమే కాదు.. దేశ వ్యాప్తంగా ఏపీ అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు తీరు ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. అనంతబాబు మాజీ డ్రైవర్ దారుణ  హత్యకు గురి కావటం ఒక ఎత్తు అయితే.. మరణించిన తర్వాత స్వయంగా కారులో తీసుకొచ్చి రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా చెప్పటం.. దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం కావటం తెలిసిందే.సంచలనంగా మారిన హత్యోదంతం చోటు చేసుకున్న నాలుగు రోజుల తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేసిన పోలీసులు.. సోమవారం ప్రెస్ మీట్ పెట్టి హత్య జరిగిన విషయాల్ని వెల్లడించారు.

ఇందులో పేర్కొన్న అంశాలకు భిన్నమైన ఆధారాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ నెల పందొమ్మిది రాత్రి పదిన్నర గంటల వేళలో ఎమ్మెల్సీ అపార్టుమెంటు వద్ద గొడవ జరిగిందని.. ఆవేశంతో కొట్టే క్రమంలో మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ప్రాణాలు పోయినట్లుగా జిల్లా ఎస్పీ వెల్లడించగా.. అక్కడి దగ్గర్లో ఉన్న సీసీ కెమేరాలో మాత్రం అలాంటి దృశ్యాలు కనిపించకపోవటం షాకింగ్ గా మారింది.

అంతేకాదు.. అదే రోజు రాత్రి పన్నెండు గంటల సమయంలో అనంత బాబు హడావుడిగా భార్యతో తిరిగి వచ్చి.. మళ్లీ ఒంటి గంటకు వెళ్లినట్లుగా సీసీ కెమేరాల్లో నమోదైంది.

ఇదిలా ఉంటే అనంతబాబు ఉండే అపార్టుమెంట్ వాచ్ మెన్ శ్రీను చెప్పిన అంశాలు ఇప్పుడు కొత్త సందేహాలకు తావిచ్చేలా మారాయి. చనిపోయిన సుబ్రహ్మణ్యంకు తాను బాబాయిని అవుతానని చెప్పిన అతడు.. 'పుట్టిన రోజు వేడుకలు ఇక్కడ జరగలేదు. ఎస్పీ చెప్పినట్లు ఇక్కడ ఎలాంటి గొడవలు జరగలేదు.

ప్రమాదంలో చనిపోయినట్లు సుబ్రహ్మణ్యం తండ్రి నాకు ఫోన్ చేసి చెప్పారు. అదేసమయంలో అనంతబాబు కంగారుగా వెళ్లారు. అనంత బాబుతో ఆయన సతీమణి ఉన్నారు. పోలీసులు ఎవరూ మా దగ్గరకు రాలేదు' అని వాచ్ మెన్ శ్రీను చెప్పిన మాటలు ఇప్పుడు కొత్త సందేహాలతో పాటు.. జిల్లా ఎస్పీ చెప్పిన మాటలకు భిన్నంగా పరిస్థితులు ఉండటం.. ఈ హత్య  ఉదంతంలో కొత్త ట్విస్టు చోటు చేసుకున్నట్లుగా చెప్పక తప్పదు.