Begin typing your search above and press return to search.

ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌ ఆవేద‌న‌.. రీజ‌నేంటంటే!

By:  Tupaki Desk   |   29 July 2021 9:47 AM GMT
ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌ ఆవేద‌న‌.. రీజ‌నేంటంటే!
X
``అప్పుచేసి ప‌ప్పు కూడు..! అంటే వినడ‌మే కానీ.. ఈ రేంజ్‌లో ఉంటుంద‌ని చూడ‌లేదు గురూ!`` ఇదీ.. వైసీపీ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న సంభాష‌ణ‌. ``మేం ఓ కోటి రూపాయ‌లు నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి కేటాయించ‌మ‌ని ఏడాది కాలంగా కోరుతున్నాం. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు దిక్కులేదు. కానీ.. మా నాయ‌కుడు.. ప్ర‌జ‌ల‌కు నేరుగా ప‌థ‌కాలు అందిస్తున్నాడు `` అంటూ.. మ‌రికొంద‌రు నేత‌లు.. అస‌హ‌నంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నా రు. తాజాగా జ‌గ‌న్ విద్యార్థుల‌కు విద్యాదీవెన కింద కోట్ల రూపాయ‌ల‌ను ఇస్తున్నారు. ఇవి ఇవ్వాల్సిందే. కానీ.. ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలి క‌దా?! అనేది నేత‌ల మాట‌.

ఒక‌ప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న టీడీపీ నేత‌లు చేసిన కామెంట్లు.. తాజాగా వైసీపీ వ‌ర్గాల్లో వినిపిస్తుండ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. ``మా నియోజ‌క‌వ‌ర్గం చాలా వెనుక‌బ‌డి ఉంది. గ‌త ఐదేళ్లలో ప్ర‌తిప‌క్షంలో ఉండ‌డంతో నియోజ‌క‌వ‌ర్గానికి ఏమీ చేయ‌లేదు. ప్ర‌జ‌లు అర్థం చేసుకుని.. న‌న్ను గెలిపించారు. మ‌రి.. ఇప్పుడు మా స‌ర్కారే రాజ్య‌మేలుతోంది క‌దా! అయినా.. మాకు రూపాయి ఇవ్వ‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో త‌ట్ట మ‌ట్టి ఎత్త‌లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతాను`` క‌ర్నూలు జిల్లాకు చెందిన ఓ నియోజ‌క‌వ‌ర్గం సీనియ‌ర్ వైసీపీ నాయ‌కుడి ఆవేద‌న క‌ట్ట‌లు తెగింది.

``ప‌క్క‌నే కృష్ణ‌మ్మ ఉంది. ఉయ్యూరులో చిన్న ప్రాజెక్టు క‌డితే.. ఇక్క‌డి వారికి ఎప్పుడు కావాలంటే.. అప్పు డు నీరివ్వ‌చ్చు. పాద‌యాత్ర స‌మ‌యంలోనూ మా నాయ‌కుడు ఇక్క‌డివారికి హామీ ఇచ్చారు. ఆ త‌ర్వాత‌.. కొంత హ‌డావుడి అయితే.. జ‌రిగింది. మంత్రుల‌తో క‌మిటీ అన్నారు. కానీ.. మ‌రుగున ప‌డింది. ఇప్పుడు అడి గితే.. `డ‌బ్బులేవీ?!` అంటున్నారు. మ‌ళ్లీ గెలుస్తాన‌నే న‌మ్మ‌కం లేకుండా చేస్తున్నారు`` కృష్ణాజిల్లాకు చెందిన మాజీ మంత్రి వ‌ర్యుల ఆవేద‌న ఇది. ఇలా.. చెప్పుకొంటూ.. పోతే.. దాదాపు 70 నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌లు స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక కుస్తీ ప‌డుతున్నారు.

ఒక‌వైపు ప్ర‌జ‌ల‌కు నేరుగా సంక్షేమం అందిస్తున్నార‌ని.. అయితే.. సంక్షేమంతోపాటు.. అభివృద్ధికూడా ముఖ్య‌మేన‌ని.. అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. త‌మ‌కు నిధులు ఇవ్వ‌క‌పోవ‌డంతో.. ఎక్క‌డా అభివృద్ధి అనే మాట కూడా వినిపించ‌డం లేద‌ని.. క‌స్సుబుస్సులాడుతున్నారు. మ‌రో రెండు న్న‌రేళ్ల‌లో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా.. త‌మ‌ను క‌రుణించాల‌నేది వారి డిమాండ్. వివిధ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతో.. సీఎం జ‌గ‌న్‌పై ప్ర‌జ‌ల్లో క్రేజ్ ఉంది. పార్టీపై సానుకూల‌త కూడా ఉంది. అయితే.. లోక‌ల్‌గా చూసుకుంటే.. నియోజ‌క‌వ‌ర్గం స్థాయిలో అభివృద్ధి లేక‌పోతే.. ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు త‌ప్ప‌డం లేద‌ని.. నాయ‌కులు వాపోతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా.. సంక్ష‌మాన్ని కొన‌సాగిస్తూనే.. అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇవ్వాల‌నేది వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల మాట‌. ఈ విష‌యాన్ని పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకువెళ్లేందుకు కొంద‌రు నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి వివ‌రించి.. సంక్షేమానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. అదేస‌మ‌యంలో అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇచ్చేలా.. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.