ఆ మాజీ ఎమ్మెల్యే పుత్రరత్నం పెంచే కోడిని మర్డర్ చేశారట

Mon Sep 13 2021 09:38:07 GMT+0530 (IST)

MLA's son wants to do postmortem

తాను అల్లారు ముద్దుగా పెంచుకునే కోడిని మర్డర్ చేశారంటూ విచిత్రమైన ఆరోపణ చేసి అందరి నోట్లో నానుతున్నాడు ఒక మాజీ ఎమ్మెల్యే పుత్రరత్నం. జంతుప్రేమికుడైన అతడిగాడి తాజా వాదనకు స్థానిక పోలీసులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఈ విచిత్ర ఉదంతం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.తన కోడిని హత్య చేశారంటూ షాకింగ్ ఆరోపణ చేస్తున్నాడు మాజీ ఎమ్మెల్యే దుఖీ ప్రసాద్ కుమారుడు రాజ్ కుమార్ భారతి. ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లా పిప్రకల్యాణ్ గ్రామానికి చెందిన ఆయన కంప్లైంట్ కు పోలీసులు పరేషాన్ అవుతున్నారు. తాను జంతు.. పక్షుల ప్రేమికుడినని.. తన దగ్గర ఎన్నో పక్షలు ఉన్నాయని.. వాటిని పెంచుతున్నట్లుగా చెబుతున్నాడు.

అలా తాను ఒక కోడిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నానని పేర్కొన్నారు. తాజాగా సదరు కోడి అకస్మాత్తుగా మరణించిందని.. దాని చావు సహజమైనది కాదని.. దానిని ఎవరో హత్య చేశారని ఆరోపిస్తున్నారు. దానికి విషాన్ని ఇచ్చి చంపేశారంటున్నారు. తన కోడికి పోస్టుమార్టం చేయాలని ఆయన కోరుతున్నారు. తన ఫిర్యాదును తీసుకొని కేసు రిజిస్టర్ చేయాలని కోరుతున్నాడు. విచారణ జరిపి తన కోడిని చంపిన వారిని అరెస్టు చేయాలంటున్నాడు.

దీంతో.. కోడి హత్య వ్యవహారం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. నిజంగానే మాజీ ఎమ్మెల్యే కొడుకు ఆరోపిస్తున్నట్లు ఆయన పెంచుకుంటున్న కోడిని హత్య చేశారా? నిందితులు ఎవరు? ఇంతకీ పోలీసులు కేసు నమోదు చేస్తారా? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏమైనా తన పెంపుడు కోడిని మర్డర్ చేశారన్న మాజీ ఎమ్మెల్యే కొడుకు మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.