కేసీఆర్ కు భారీ షాక్.. సంచలన ప్రకటన చేసి రాజాసింగ్ రాజీనామా

Mon Aug 02 2021 15:37:30 GMT+0530 (IST)

MLA Rajasingh Gave Shock To KCR

ఈ ప్రపంచంలో ఎవరూ అపర మేధావులు కారు. అలా అని ఎవరూ చేతకాని చవట దద్దమ్ములు కారు. తెలివైన వారు సైతం కొన్నిసార్లు కాలానికి దొరికిపోతుంటారు. కొందరికి కాలం కలిసి వచ్చి.. ఏం చేసినా తిరుగులేకుండా సాగుతుంటుంది. అలాంటి వారికి ఒక్కోసారి దిమ్మ తిరిగే షాక్ తగులుతుంటుంది. తాజాగా అలాంటి భారీ షాకే ఇచ్చారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇటీవల కాలంలో ఉప ఎన్నికలు జరిగితే చాలు.. ఆ సీటును సొంతం చేసుకోవటానికి భారీ ఎత్తున వరాలు ప్రకటించటం.. పెద్ద ఎత్తున నిధులు పారించటం తెలిసిందే. ఇలా చేస్తున్న సీఎం కేసీఆర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నా.. లైట్ తీసుకుంటున్నారు.ఇలాంటి వేళ.. తాజాగా బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నేరుగా సవాలు విసిరి మరి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గోషామహాల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నియోజకవర్గ ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని.. సీఎం నిధులు ప్రకటించినంతనే స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని ప్రకటించారు.

ఉప ఎన్నిక వస్తే కేసీఆర్ కు బడుగులు.. రైతులపై ప్రేమ వస్తోందన్న ఆయన.. గోషామహల్ నియోజకవర్గంలోని ఎస్సీ.. ఎస్టీ.. బీసీలకు సైతం రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. ఇలా చేస్తే.. కచ్ఛితంగా తాను స్పీకర్ వద్దకు వెళ్లి రాజీనామా పత్రాన్ని సమర్పిస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈటలకు మధ్య మొదలైన విభేదాల నడుమ.. ఆయనపై భూకబ్జా ఆరోపనలు రావటం.. మంత్రివర్గం నుంచి తొలగించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఈటల రాజేందర్.

అప్పటి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ కు నిధుల వరద పారటమే కాదు.. ఆ నియోజకవర్గానికి భారీ ఎత్తున వరాల్ని ప్రకటిస్తున్నారు. అన్నింటికి మించి నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ఎస్సీ ఓటర్ల మనసుల్ని దోచేలా.. ఆయన తెలంగాణ దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. ఈ నెలలోనే దాన్ని ఆ నియోజకవర్గం నుంచే మొదలుపెడతామన్నారు. ఈ పథకంలో అర్హులైన వారికి రూ.10లక్షల మొత్తాన్ని అందించనున్నారు. ఈ పథకం కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసేందుకు వెనక్కి తగ్గన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల్ని రాజీనామాలు చేయాలన్న డిమాండ్ తెర మీదకు వస్తోంది.

ఎమ్మెల్యే రాజీనామా చేశాక.. ఉప ఎన్నిక ఖాయం కావటం.. ఆ సందర్భంగా పార్టీని గెలిపించుకోవటం కోసం భారీగా వరాల్ని ప్రకటించటం ఈ మధ్యన ఎక్కువైంది. హుజూరాబాద్ కు పారుతున్న నిధుల వరదను చూసినోళ్లు.. తమ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల్ని రాజీనామా చేయాలన్న డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. తన రాజీనామా అస్త్రాన్ని తాజాగా ప్రకటన రూపంలో ప్రయోగించారు. మరి.. దీనికి సీఎం కేసీఆర్ స్పందన ఏమిటి? రాజాసింగ్ కోరుకున్నట్లే సీఎం కేసీఆర్ నుంచి ప్రకటన వెలువడతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పాలి.