Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: కేసీఆర్ సర్కార్ కు గట్టి షాక్

By:  Tupaki Desk   |   6 Dec 2022 12:59 PM GMT
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: కేసీఆర్ సర్కార్ కు గట్టి షాక్
X
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో ముగ్గురు ఏజెంట్లను చాకచక్యంగా పట్టుకున్న కేసీఆర్ వారి వెనుకున్న వారిని బయటకు తీయాలన్న ప్రయత్నాలు ఫలించడం లేదు. కోర్టుల్లో తేలిపోతోంది. తాజాగా ఈ కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. ఈ కేసులో దూకుడుగా ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్న సిట్ కు అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఈ కేసులో మరో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అనుమానితులుగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గు స్వామి, కరీంనగర్ కు చెందిన అడ్వకేట్ శ్రీనివాస్ లను నిందితులుగా చేరుస్తూ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. అయితే విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసులు దాఖలు చేసిన మెమోను కొట్టివేసింది. సిట్ దాఖలు చేసిన మెమోపై అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయస్థానం దానిని తిరస్కరించింది.

ఈ కేసులో నోటీసులు అందుకున్న బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేయగా వాదనలు విన్న హైకోర్టు ఆయనకు ఊరటనిచ్చింది. మొదట డిసెంబర్ 5వ తేదీ వరకూ స్టే విధించిన ధర్మాసనం మళ్లీ స్టేను ఈనెల 13వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది.

మరోవైపు తుషార్, జగ్గుస్వామిలు సైతం సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులపై కోర్టును ఆశ్రయ్యించారు. ఇక వాటిపై కూడా న్యాయస్థానం స్టే విధించడంతో సిట్ అధికారులకు ఈ కేసులో ముందుకెళ్లాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఇక మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ లను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది.

ఇక బెయిల్ కోసం ప్రయత్నం చేసిన వారికి ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారికి బెయిల్ ఇవ్వద్దని బెయిల్ ఇస్తే వారు సాక్ష్యాలను తారుమారు చేస్తారని ప్రభుత్వం తరుఫు న్యాయవాది వాదనలు వినిపించినప్పటికీ హైకోర్టు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసి షాకిచ్చింది. ఈ వ్యవహారం తెలంగాణ సర్కార్ కు షాకింగ్ గా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.