Begin typing your search above and press return to search.

పాదయాత్రకు అండగా వస్తే అయ్యన్నపాత్రుడిని తొక్కేస్తాడట

By:  Tupaki Desk   |   25 Sep 2022 4:23 AM GMT
పాదయాత్రకు అండగా వస్తే అయ్యన్నపాత్రుడిని తొక్కేస్తాడట
X
మేం చెప్పినట్లే జరగాలి. మేం కోరుకున్నట్లు పరిస్థితులు ఉండాలి. మేం అనుకున్నట్లే అన్ని ఉండాలనుకోవటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. ఎందుకంటే.. ఎవరైనా కావొచ్చు.. అన్నీతమ కంట్రోల్ లో ఉండటం ఎంత హాస్యాస్పదమో.. అధికారంలో ఉన్న వారు ప్రతిపక్షనేతలు.. ప్రజలు తాము కోరుకున్నట్లు మాత్రమే ఉండాలనుకోవటం అత్యాశే అవుతుంది.

అధికారంలో ఉన్నప్పుడు.. ఆ ధీమా వేరుగా ఉంటుంది. వైఎస్ జగన్ లాంటి ఛరిష్మా ఉన్న అధినేత ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరించినప్పుడు ముందు.. వెనుకల్ని చూసే అలవాటును మిస్ అవుతుంటారు. అధికారం శాశ్వితమన్నట్లుగా వారి మాటలు ఉంటాయి. రేపొద్దున తాము విపక్షంలో కూర్చున్నప్పుడు.. దీనికి మించిన ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాలన్న విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా ఉండటం కనిపిస్తూ ఉంటుంది.

ఏపీ రాజధాని అమరావతిగా పేర్కొంటూ ఆ ప్రాంతానికి చెందిన రైతులు చేస్తున్న నిరసనలు.. ఆందోళనలకు కొనసాగింపుగా అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తుండటం.. దీనిపై వస్తున్న విమర్శలు.. ఆందోళనలు.. అధికార పార్టీ నేతల హుంకారాలు.. వెరసి పాదయాత్ర అంశం తరచూ వివాదాస్పదంగా మారుతోంది. ఇలాంటివేళ.. పాదయాత్రకు సంబంధించి తాజాగా వైసీపీ ఎమ్మెల్యే.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర.. ఉత్తరాంధ్రలో అలజడిని క్రియేట్ చేయటానికి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన.. అమరావతి రైతుల్ని తాము అడ్డుకుంటామని వ్యాఖ్యానించారు. తాము చేసే పనులను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులకు అండగా ఉండేందుకు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వస్తే.. అక్కడే ఆయన్ను తొక్కేస్తానంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తాజాగా ఆయన చేసిన ప్రకటనను చూస్తే.. అరసవెల్లి సూర్యభగవానుడి దర్శనానికి వెళ్లాలంటే బస్సులోనో..కారులోనో.. రైల్వేలోనో నేరుగా వెళ్లటం తప్పు కాదన్నారు. అంతే తప్పించి.. పాదయాత్రగా వస్తే మాత్రం సరికాదంటున్నారు. ఉత్తరాంధ్రలో గొడవల్ని క్రియేట్ చేయటానికే పాదయాత్రగా వస్తున్నారని.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాల్ని దెబ్బ తీయటాన్ని తాము సహించలేమంటూ చిత్రమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ఇవాల్టిరోజున పాదయాత్రను అడ్డుకుంటామని చెప్పిన అధికార పార్టీ ఎమ్మెల్యే.. రేపొద్దున తాము విపక్షంలో ఉంటే.. ఇలాంటివేమీ చేసే అవకాశం ఉండదన్న చిన్న విషయాన్ని వదిలేసి.. వార్నింగ్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? అన్నదిప్పుడు అసలు ప్రశ్నగా మారిందని చెప్పాలి.