మరోసారి గుడివాడలో కొడాలి నాని కలకలం!

Tue Jun 28 2022 08:38:49 GMT+0530 (IST)

MLA Kodali Nani enters Zoom Meeting

ఇటీవల  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పదో తరగతి విద్యార్థులతో నిర్వహించిన జూమ్ మీటింగ్ లోకి కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రవేశించి కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీన్ని ఇంకా టీడీపీ నేతలు మరిచిపోకముందే ఈసారి కొడాలి నాని అనుచరుల వంతు వచ్చింది.జూన్ 29న గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ మినీ మహానాడు జరగనుంది. ఈ నేపథ్యంలో కొడాలి నాని అనుచరులు మరోసారి టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే పనికి పాల్పడ్డారని అంటున్నారు. గుడివాడ మండలం బొమ్ములూరులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ రంగులు వేయడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఇటీవల లోకేష్ జూమ్ మీటింగ్ లోకి కొడాలి నాని చొరబడిన ఘటననే మరిచిపోలేకున్న టీడీపీ శ్రేణులకు తాజాగా రంగులు పూసిన ఘటన పుండు మీద కారం చిమ్మినట్టైయిందని చెబుతున్నారు.

కారణం.. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు గుడివాడకు దగ్గరలో ఉండటమే. దీంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మినీ మహానాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇతర ముఖ్య నేతలు హాజరవుతున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. కావాలనే తమను రెచ్చగొట్టి గొడవకు దిగాలనేదే వైఎస్సార్సీపీ వ్యూహమని నిప్పులు చెరుగుతున్నారు. మినీ మహానాడు జరగనీయకుండా రసాభాస సృష్టించడమే వైఎస్సార్సీపీ లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆ పార్టీ జెండా రంగులు వేశారని ఆరోపిస్తున్నారు.

కాగా చంద్రబాబు మినీ మహానాడు నిర్వహించే అంగులూరుకు కేవలం కిలోమీటరు దూరంలోనే బొమ్ములూరు ఉంది. ఇక్కడున్న ఎన్టీఆర్ విగ్రహానికి కొందరు రాత్రికి రాత్రి వైఎస్సార్సీపీ రంగులు వేశారని చెబుతున్నారు. దీంతో విషయం తెలుసుకున్న కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు  మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఇతర నాయకులు బొమ్ములూరు చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ రంగులు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. విగ్రహానికి క్షీరాభిషేకం చేసి శుద్ధి చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఉన్న వైఎస్సార్సీపీ చెరిపి వేసి టీడీపీ జెండా రంగులు వేయించారు.

కాగా గుడివాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులే దీనికి పాల్పడ్డారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కొడాలి నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. మహానాడు బ్యానర్ల పై అధికార పార్టీ నేతల బ్యానర్లు వేసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తుతున్నారు.

ఎన్టీఆర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ రంగులు పూయడం దారుణమని నిప్పులు చెరుగుతున్నారు. ఉద్దేశపూర్వకంగా మినీ మహానాడును అడ్డుకోవడంతోపాటు చంద్రబాబు పర్యటనను అడ్డుకునే చర్యల్లో భాగంగానే కొడాలి నాని బరి తెగించారని చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు అంటున్నారు.