సంగారెడ్డి ప్రజల కోసం తల వంచుతున్నట్లు చెప్పిన ఫైర్ బ్రాండ్

Wed Oct 09 2019 15:14:57 GMT+0530 (IST)

MLA Jagga Reddy Speech at Dussehra Celebrations in Sangareddy

తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తీవ్రమైన ప్రతికూలతల్ని ఎదుర్కొని మరీ ఎన్నికల్లో గెలిచే తీరు ఆయన్ను మిగిలిన వారికి భిన్నంగా నిలుపుతుంది. తరచూ సంచలన వ్యాఖ్యలు చేసే జగ్గారెడ్డి.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దసరా సందర్భంగా తన నియోజకవర్గ ప్రజల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. పండుగ పూట.. ప్రజలతో తాను కొన్ని విషయాల్ని చెప్పాలనుకుంటున్నానని.. తనకు పది నిమిషాలు సమయం ఇవ్వాలని కోరిన జగ్గారెడ్డి నోటి నుంచి ఊహించని రీతిలో వ్యాఖ్యలు వచ్చాయి.

మంత్రి హరీశ్ రావుతో తనకు సంవత్సరాల తరబడి మాటలు లేవని.. కానీ సంగారెడ్డి ప్రజల కోసం తాను మాట్లాడతానని చెప్పారు. తాను ఎవరికి తలొగ్గనని.. కాకుంటే సంగారెడ్డి ప్రజల కోసం తల వంచుతానని.. కేసీఆర్ తో మాట్లాడతానని పేర్కొన్నారు. ఎవరికి తలవంచని తాను.. సంగారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు వెనుకాడనని చెప్పారు. సీఎం కేసీఆర్ సంగారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నారు.  

జగ్గారెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఆసక్తికర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒకప్పుడు కేసీఆర్ పేరు వినిపిస్తే చాలు నిప్పులు చెరిగే జగ్గారెడ్డి.. అందుకు భిన్నంగా సంగారెడ్డి ప్రజల కోసం తలవంచుతానని చెబుతున్న వేళ.. అక్కడున్న పలువురు కేసీఆర్ మాట విన్నంతనే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయటం గమనార్హం. దీంతో.. ఉలిక్కిపడిన జగ్గారెడ్డి.. ఆపండ్రా నాయనా.. ఇప్పుడా మాటలు ఎందుకంటూ సర్ది చెప్పటం కనిపించింది. నాయకుల నాలుక మారినంత ఈజీగా వారిని ఫాలో అయ్యే వారి నాలుక త్వరగా మారలేదు కదా?