Begin typing your search above and press return to search.

పశ్చిమాన తమ్ముడు పలకడేమి... ?

By:  Tupaki Desk   |   17 Jan 2022 9:14 AM GMT
పశ్చిమాన తమ్ముడు పలకడేమి... ?
X
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. తనకు అవకాశం ఉండాలే కానీ ఒకేసారి పదమూడు జిల్లాలలో తిరిగి జనాల మూడ్ పూర్తిగా మార్చేయడానికి కూడా ఆయన తయారు. మరి ఆయన వయసు ఏడు పదులు దాటింది. సీనియర్ మోస్ట్ నేత. అయినా ఆ జోష్, హుషార్ ఎక్కడా తగ్గేది లేదు అన్నట్లుగానే ఉంటుంది. మరి ఆయనతో పోల్చుకుంటే తమ్ముళ్ళు ఎలా ఉన్నారు. పార్టీ పట్ల వారికి ఉన్న సిన్సియారిటీ ఏంటి అన్నది కూడా చర్చగా ఉంది. అక్క ఆరాటమే కానీ బావ బతికేట్టు లేడు అన్న ముతక సామెత మాదిరిగా బాబు ఎంత అరచి గీ పెడుతున్నా తమ్ముళ్ళు చాలా మంది మాత్రం పెద్దగా చడీ చప్పుడు లేకుండానే ఉన్నారన్న విమర్శలు సొంత పార్టీలోనే ఉన్నాయి.

విశాఖ సిటీలో చూసుకుంటే నాలుగు దిక్కులూ టీడీపీ గెలిచింది. సిటీ జనాలు టీడీపీయే తమకు దిక్కు అనేశారు. అలా గెలిచిన వాటిలో పశ్చిమ సీటు ఒకటి. ఏకంగా పాతిక వేల ఓట్ల మెజారిటీతో ఇక్కడ తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యే గణబాబు గెలిచారు. జగన్ వేవ్ లో అంత పెద్ద మెజారిటీ రావడం అంటే మామూలు విషయం కాదు. ఇక గణబాబు ఇప్పటికి అయిదు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు గెలిచారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయన వివాదరహితుడిగా ఉన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఆయన పేరు మంత్రి పదవికి కూడా వినిపించింది. ఎందుకో అది కుదరలేదు. ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య గణబాబు బాగా స్లో అయ్యారనే టాక్ నడుస్తోంది. ఆయన పార్టీ కార్యక్రమాల్లో కూడా మునుపటి మాదిరిగా దూకుడుగా పాల్గొనడంలేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఆయనకు విజయనగరం జిల్లా ఇంచార్జి బాధ్యతలను కూడా పార్టీ అప్పగించింది.

అయినా ఆయన తన వరకూ తాను చూసుకుంటున్నారు అనే అంటున్నారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు దోస్తుగా కూడా గణబాబుకు పేరుంది. గంటాతో కలసి అప్పట్లో ప్రజారాజ్యంలోకి వెళ్లి పోటీ చేసి వెనక్కి వచ్చిన నేతగా గణబాబు ఉన్నారు. మొతానికి గణబాబు ఎందుకో గతంలో మాదిరిగా జోరు అయితే చేయడంలేదు. ఒక దశలో ఆయన వైసీపీలో చేరుతారు అన్న ప్రచారం కూడా జరిగింది. దాన్ని ఆయన ఖండించారు కానీ టీడీపీలో మాత్రం చురుకుదనం చూపించడంలేదు.

ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ పశ్చిమలో వైసీపీకి సరైన నాయకుడు లేరు. మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ కి గణబాబుని ఢీ కొట్టే పరిస్థితి లేదు అంటున్నారు. దాంతో వైసీపీ ఆయన్ని తమ వైపునకు తిప్పుకోవాలని చూస్తోంది అని చెబుతున్నారు. ఇంకో వైపు చూసుకుంటే ఇక్కడ సీటుని పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారని కూడా ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాలు చూస్తూంటే గణబాబు ఏమైనా జంప్ చేస్తారా అన్న చర్చ వస్తోంది. ఆయన తండ్రి నుంచి కూడా టీడీపీలోనే ఎదిగారు. మరి గణబాబు అయితే పెదవి విప్పడంలేదు. వచ్చే ఎన్నికల్లో ఆయన రూట్ ఏంటి అన్నది కూడ ఎవరికీ తెలియడంలేదు. చూడాలి మరి ఈ సీనియర్ తమ్ముడు తన యాక్షన్ ద్వారా ఎలాంటి సంచలనాలను నమోదు చేస్తారో.