Begin typing your search above and press return to search.

కిక్కో కిక్కు..చరిత్రలో తొలిసారి డబుల్ సూపర్ ఓవర్.. పంజాబ్ థ్రిల్లింగ్ విన్!

By:  Tupaki Desk   |   19 Oct 2020 3:30 AM GMT
కిక్కో కిక్కు..చరిత్రలో తొలిసారి డబుల్  సూపర్ ఓవర్..  పంజాబ్ థ్రిల్లింగ్ విన్!
X
ఇది కదా మ్యాచ్ అంటే.. ఇది కదా మజా అంటే. ఐపీఎల్ చరిత్రలోనే మునుపెన్నడూ లేనంత ఉత్కంఠ భరిత మ్యాచ్ ఇవాళ ముంబై ఇండియన్స్, -కింగ్స్ లెవెన్ పంజాబ్ మధ్య జరిగింది. రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎలా సాగిందంటే చూస్తున్నది.. వరల్డ్ కప్ నా ఐపీఎల్లా అనిపించింది. మామూలుగా మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్ మ్యాచ్ అంటేనే ఎంతో థ్రిల్లింగ్ మ్యాచ్. మరి సూపర్ ఓవర్ కూడా టై అయితే.. అది ఎంత థ్రిల్లింగ్ మ్యాచ్ అర్థమవుతుంది. అలా ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి సూపర్ ఓవర్ టై అయ్యి మరోసారి సూపర్ ఓవర్ నిర్వహించారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ సూపర్ ఓవర్లో చివరికి విజయం పంజాబ్ నే వరించింది. పంజాబ్‌, ముంబై జట్లు ఒకే స్కోర్ చేయడంతో మ్యాచ్‌ టై అయ్యింది. దీంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. సూపర్‌ ఓవర్ కూడా టైగా మారింది. దీంతో మరో సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. ఇందులో పంజాబ్‌ అద్బుత ప్రదర్శన చేసి టోర్నీలో మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. డికాక్‌ (53; 43 బంతుల్లో, 3×4, 3×6), పొలార్డ్‌ (34*; 12 బంతుల్లో, 1×4, 4×6), కౌల్టర్‌నైల్‌ (24*, 12 బంతుల్లో, 4×4) అదరగొట్టారు. ఛేదనలో పంజాబ్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి కరెక్టుగా 176 పరుగులే చేసింది. కేఎల్‌ రాహుల్ (77; 51 బంతుల్లో, 7×4, 3×6) మరో సారి క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. గేల్ 24, నికోలస్ పూరన్ 24 రన్స్ చేశారు. మయాంక్ అగర్వాల్ (14), మాక్స్‌వెల్ (0) విఫలమయ్యారు.

మలుపు తిప్పిన చివరి ఓవర్

చివరి ఓవర్‌ లో పంజాబ్ కు 9 పరుగులు కావాల్సిన వేళ.. బోల్ట్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. క్రిజ్ లో ఉన్న దీపక్ హుడా, జోర్డాన్ భారీ షాట్లు ఆడలేకపోయారు. వారు కరెక్ట్ గా 9 పరుగులే సాధించడం తో మ్యాచ్ టై అయింది.

మొదటి సూపర్ ఓవర్ సాగిందిలా..

మొదటి సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి 5 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు చేసి ఔటయ్యాడు. పూరన్ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు. ముంబై బౌలర్ బుమ్రా సూపర్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ వేసి అదుర్స్ అనిపించాడు.

అనంతరం ముంబై ఇండియన్స్ తరుపున డికాక్, రోహిత్ క్రీజులోకి వచ్చారు. పంజాబ్ బౌలర్ షమీ సూపర్ ఓవర్ వేశాడు. మొదటి మూడు బంతులకు మూడు సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. నాలుగో బంతి వృథా కాగా.. ఐదో బంతికి సింగిల్ మాత్రమే వచ్చింది. ఆఖరి బంతికి 2 పరుగులు కావాల్సిన సమయంలో డికాక్ ఒక రన్ మాత్రమే తీశాడు. రెండో పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. దీంతో సూపర్ ఓవర్‌ కూడా టై అయ్యింది.


రెండో సూపర్ ఓవర్ సాగిందిలా

రెండో సూపర్ ఓవర్‌ లో పంజాబ్ బౌలర్ జోర్డాన్ బౌలింగ్ వేయగా మొదటి బంతికి పొలార్డ్ సింగిల్ తీశాడు. రెండో బంతి వైడ్ వెళ్లింది. ఆ తర్వాత బంతిని పాండ్యా సింగిల్ తీశాడు. మూడో బాల్‌ను పొలార్డ్ ఫోర్ కొట్టాడు. నాలుగో బంతి వైడ్ వెళ్లింది. ఆ తర్వాతి బంతికి పాండ్యా రనౌట్ అయ్యాడు. ఐదో బంతికి పరుగులు రాలేదు. ఆరో బంతికి పోలార్డ్ భారీ షాట్ కొట్టగా బౌండరీ లైన్ వద్ద మయాంగ్ అగర్వాల్ అద్భుతం గా ఫిల్డింగ్ చేసి.. సిక్స్‌ని ఆపాడు. దీంతో ముంబయి 11 పరుగులు చేసింది. తర్వాత పంజాబ్ తరుపున బరిలోకి దిగిన గేల్‌ వచ్చి రాగానే ఫస్ట్ బాల్ కే సిక్స్ కొట్టాడు. దీంతో పంజాబ్ వత్తిడి తగ్గి పోయింది. రెండో బాల్ కి గేల్ సింగిల్ తీశాడు. ఆ తర్వాత మయాంక్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టి మరో రెండు బంతులుండగానే విజయాన్ని అందించాడు