పెళ్లైన 4 నెలలకే పుట్టింటికి వెళ్లింది.. రెండో పెళ్లి చేసుకొచ్చింది!

Sun Jul 25 2021 19:00:01 GMT+0530 (IST)

The two fell in love and married together

ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇంట్లో తెలిసింది. రెండు కుటుంబాల వారూ కలిసి పెళ్లి చేశారు. అత్తింట్లో నాలుగు నెలలపాటు కాపురం చేసింది. ఆ తర్వాత అమ్మవాళ్లను చూడాలని చెప్పి పుట్టింటికి వెళ్లింది. అక్కడి నుంచి అటే వెళ్లి రెండో పెళ్లి చేసుకొని వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.యూపీలోని కాన్పూర్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకున్నారు. రెండేళ్లపాటు కలిసి తిరిగారు. అనంతరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం ఇంట్లో చెప్పడంతో.. రెండు కుటుంబాల వారు దగ్గరుండి పెళ్లి చేశారు. గతేడాది జూన్ 4న ఆర్యసమాజ్ లో వీళ్ల పెళ్లి జరిగింది.

ఆ తర్వాత నాలుగు నెలలపాటు వీరి సంసారం సాఫీగానే సాగింది. అయితే.. ఐదో నెలలో పుట్టింటికి వెళ్లివస్తానని వెళ్లింది. ఆ తర్వాత భర్త వద్దకు రాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాప్ అని వచ్చిందట. దీంతో.. ఏం జరిగిందోనని వెళ్లి ఆరాతీస్తే.. విషయం చెప్పలేదు. తాను మాత్రం ఇక కాపురం చేయలేనని నీతో రాను అని చెప్పింది. ఎప్పటికైనా భార్య తిరిగి వస్తుందని ఎదురు చూసిన భర్తకు ఒక రోజు వాట్సాప్ లో ఓ వీడియో వచ్చింది.

అది చూసిన భర్త షాకయ్యాడు. వీళ్లిద్దరూ ఏ ఆర్యసమాజ్ లోనైతే పెళ్లి చేసుకున్నారో.. అదే చోట మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం చూసిన భర్తకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. దీంతో.. తీవ్ర ఆవేదనకు గురై పోలీసులను ఆశ్రయించాడు. ఇంట్లోని బంగారు నగలు నగదు తీసుకొని వెళ్లిపోయిన తన భార్య.. తిరిగి రాకుండా.. మరో పెళ్లి చేసుకుందని తనకు న్యాయం చేయాలని కోరాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ కేసులో భార్య వెర్షన్ ఏంటనేది తేలాల్సి ఉంది.