Begin typing your search above and press return to search.

పాస్ పోర్టుల మీద కమలం గుర్తు ఎందుకో తెలుసా?

By:  Tupaki Desk   |   13 Dec 2019 5:20 AM GMT
పాస్ పోర్టుల మీద కమలం గుర్తు ఎందుకో తెలుసా?
X
ఇటీవల కాలంలో కొత్త పాస్ పోర్టు కోసం అప్లై చేసుకోవటం కానీ.. రెన్యువల్ లో భాగంగా కొత్తది మీ చేతికి వచ్చిందా? అయితే.. ఒక్కసారి పాస్ పోర్టు లోపలకి వెళ్లండి. అక్కడ గులాబీ గుర్తు ఉండటం కనిపిస్తుంది. ఇప్పుడీ అంశం వివాదంగా మారింది. తాజాగా కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఎంకే రాఘవేంద్రన్ లోక్ సభలోని జీరో అవర్ లో ఈ అంశాన్ని లేవనెత్తారు.

బీజేపీ గుర్తు కమలం కావటంతో దాన్ని ప్రచారం చేసేందుకే పాస్ పోర్టు మీద అలా వాడేస్తున్నట్లుగా పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు పలువురు అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు విమర్శలు చేశారు. దీనిపై కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శి రవీశ్ కుమార్ స్పష్టత ఇచ్చారు. సెక్యురిటీ ఫీచర్స్ లో భాగంగానే కమలం గుర్తును జోడించినట్లు పేర్కొన్నారు.

కమలం జాతీయ పుష్పమన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఆ మాటకు వస్తే రొటేషన్ పద్దతిలో జాతీయ పుష్పం.. జాతీయ జంతువు.. జాతీయ వృక్షం బొమ్మలు కూడా ముద్రించనున్నట్లు చెప్పారు. నకిలీ పాస్ పోర్టులను గుర్తించేందుకే తామీ భద్రతా చర్యల్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా తాజా చర్యలు చేపట్టినట్లు క్లారిటీ ఇచ్చింది. ఏమైనా కేంద్రమంత్రివర్యులు ఇచ్చిన వివరణ కన్వీన్స్ చేసేలా ఉందని చెప్పక తప్పదు.