Begin typing your search above and press return to search.

లోకేష్‌కు గ్లామ‌రూ లేదూ.. గ్రామ‌రూ లేదే ?

By:  Tupaki Desk   |   29 July 2021 4:31 PM GMT
లోకేష్‌కు గ్లామ‌రూ లేదూ.. గ్రామ‌రూ లేదే ?
X
లోకేష్ అంటే కేరాఫ్ చంద్రబాబే అని ఈ రోజుకు చెప్పాలి. జనాలకు కూడా అలాగే అర్ధమవుతుంది. ఇక పార్టీ వారి సంగతి కూడా అంతే మరి. జగన్ మీద గట్టిగా విమర్శలు చేస్తే లోకేష్ స్థాయి ఏ మాత్రం పెరగదు. పైగా లోకేష్ ట్విట్టర్ పిట్ట అని కూడా అని అంతా అంటున్నారు.

మామూలుగా చెప్పాలి అంటే టీడీపీలో గ్లామర్ ఫేస్ ఉన్నది ఒక్కరికే. ఆయనే దివంగత ఎన్టీఆర్. ఆయన తరువాత చంద్రబాబు తన వ్యూహాలతో చాతుర్యంతోనే పార్టీని ఇంతకాలం నడిపారు. ఇక చంద్రబాబు కి గ్లామర్ లేకపోయినా గ్రామర్ అయినా ఉంది. అన్నింటికి మించి ఎవ‌రిని ఎలా గుప్పిట ప‌ట్టాలో తెలిసిన చాతుర్యం బాబు సొంతం.

లోకేష్ దగ్గరకు వస్తే అటు గ్లామర్ లేదు, ఇటు గ్రామర్ కూడా లేదు. దాంతో ఆయన జనాలలోకి వెళ్తున్నా ఏ మాత్రం స్పందన రావడంలేదు అంటున్నారు.

లోకేష్ ని జిల్లాల టూర్లకు పంపించి భావి నాయకుడిగా ప్రొజెక్ట్ చేయాలని చంద్రబాబు అయితే తెగ ఉబలాటపడుతున్నారు కానీ చంద్రబాబు ఆలోచనలు, ఆశలు తప్పు అని లోకేష్ బోసిపోయిన పర్యటనలు నిరూపిస్తున్నాయి. లోకేష్ వస్తున్నాడు అంటే టీడీపీ క్యాడర్ లో ఎక్కడా జోష్ కనిపించడంలేదు. పైగా ఆయన పరామర్శ యాత్రలు కూడా తేలిపోతున్నాయి. హడావుడి అంతా కూడా టీడీపీ అనుకూల మీడియాలో తప్ప మరెక్కడా లేదనే చెప్పాలి.

పార్టీ యువ‌నేత, భ‌విష్య‌త్ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్రొజెక్ట్ అవుతోన్న నేత వ‌స్తున్నాడంటే ప‌ర్య‌ట‌న అంతా ద‌ద్ద‌రిల్లిపోవాలి. కానీ నేత‌ల‌కే ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లు ప‌ట్ట‌డం లేదు.

ఇక మరో వైపు వైసీపీ దూకుడుగానే ఉంది. టీడీపీని ఈ పాటికే టార్గెట్ చేసి చెక్ పెట్టేసింది. ఇప్పటికే ఆ పార్టీలో నోరున్న లీడర్లకు మూడు చెరువుల నీళ్ళు తాగిస్తోంది. ఎవ‌రు గ‌ట్టిగా నోరు మెదిపితే ఎక్క‌డ చిక్కుల్లో ప‌డ‌తామో ? అన్న భ‌యంతో ఉంటున్నారు.

వారి తరఫున నిలబడి లోకేష్ సర్కార్ కి ఇస్తున్న వార్నింగులు కూడా గాలిలోనే కలసిపోతున్నాయి. ఏ మాత్రం వైసీపీ పట్టించుకోవడంలేదు. అసలు ఖాతరు చేయడంలేదు. నిజానికి ఈ టైమ్ లో చంద్రబాబు టూర్లు చేసి విమర్శలు చేసినా కూడా వైసీపీ పెద్దల నుంచి నో రెస్పాన్స్ అన్నట్లుగానే సీన్ ఉంది.

దాంతో రాజకీయంగా ఏ మాత్రం అనుభవం లేని లోకేష్ పెద్ద మాటలు మాట్లాడుతూంటే చాలా బాగుంది అని అనుకూల మీడియాలో రాసుకుని మురిసిపోవడమే తప్ప ఇటు జనాలలో కానీ అటు పార్టీలో కానీ వాటి ఇంపాక్ట్ అసలు కనిపించడంలేదు.

మొత్తానికి లోకేష్ తానున్నాను అంటూ.. క్యాడర్ ని దూకుడు చేయమంటున్నారు. కానీ లోకేష్ భరోసా వారికి ఏ మాత్రం కిక్కు ఇవ్వలేకపోతోంది. వచ్చేది మన ప్రభుత్వమే అని లోకేష్ ఎన్ని సార్లు వల్లించుకుంటున్నా ఆ నమ్మకం కూడా పార్టీలో ఎక్కడా కలగడంలేదు అంటే చినబాబు టూర్లు ఎన్ని వేసినా వేస్టే అని అర్ధమైపోతోందిగా..!