Begin typing your search above and press return to search.

లోకేష్ హామీలు స‌రే.. ఇవి నిజ‌మ‌వుతాయా ?

By:  Tupaki Desk   |   6 Feb 2023 8:00 PM GMT
లోకేష్ హామీలు స‌రే.. ఇవి నిజ‌మ‌వుతాయా ?
X
టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. త‌న పాద‌యాత్ర యువ‌గ‌ళంలో అనేక వ‌ర్గాల ప్ర‌జ లను క‌లుసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయా వ‌ర్గాల‌కు హామీల‌పై హామీలు గుప్పించేస్తున్నారు. మైనారిటీ ముస్లింలు తాజాగా నారా లోకేష్‌ను క‌లుసుకున్నారు. రాజ‌కీయంగా త‌మ‌కు గుర్తింపు త‌క్కువ‌గా ఉంద‌ని.. త‌మ‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని వేడుకున్నారు. ఆ వెంట‌నే లోకేష్ వారికి మంత్రి ప‌ద‌విని ఆఫ‌ర్ చేశారు.

టీడీపీని అధికారంలోకి తెస్తే.. మైనారిటీ వ‌ర్గానికి మంత్రి ప‌ద‌వి ఇచ్చేలా చేసే బాధ్య‌త‌ను తాను తీసుకుం టాన‌ని అన్నారు. ఇక‌, చిత్తూరు జిల్లాలోని వ‌డ్డెర సామాజిక వ‌ర్గం కూడా ఆయ‌న వ‌ద్ద‌కు వ‌చ్చారు. పూలు జ‌ల్లారు జేజేలు కొట్టారు.

ఆ వెంట‌నే పొరుగు రాష్ట్రంలో త‌మ‌ను ఎస్టీలుగా చూస్తున్నార‌ని.. త‌ద్వారా.. అక్క‌డ త‌మ కుల‌పోళ్లు.. ల‌బ్ధి పొందుతున్నార‌ని మ‌రి ఏపీలో మాత్రం బీసీలుగా ప‌రిగ‌ణిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు.

ఆ వెంట‌నే నారా లోకేష్‌.. వారికి కూడా త‌థాస్తు! అని హామీ కుమ్మ‌రించారు. టీడీపీ అధికారంలోకి రాగానే వ‌డ్డెర‌ల‌ను కూడా ఎస్టీల్లో చేర్చేలా చూస్తాన‌న్నారు. అయితే.. ఇలాంటి హామీలు సాకారం అయ్యేనా? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌.

గ‌తంలో చంద్ర‌బాబు కూడా ఇలానే వ‌స్తున్నా మీకోసం యాత్ర‌లో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తాన‌ని హామీ ఇచ్చి.. నానా తిప్పులు పడ్డారు. ఇప్ప‌టికీ .. ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. మ‌రి ఇప్పుడు నారా లోకేష్ ఇలా హామీల‌పై హామీలు గుప్పిస్తే.. అవి సాకారం అయ్యేనా? అనేది ప్ర‌శ్న‌.

మ‌రోవైపు.. ఈ హామీల‌పై అధికార‌పక్షం నేత‌లు పెదవి విరుస్తున్నారు. పాద‌యాత్ర చేస్తున్న‌నారా లోకేష్‌కు పార్టీలో అధ్య‌క్ష పీఠం లేద‌ని.. ఆయ‌న ఇచ్చే హామీలు ఉత్తుత్తి వేన‌ని వారు రివ‌ర్స్ ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో నారా లోకేష్ చేస్తున్న ప్ర‌చారం.. ఇస్తున్న హామీలు కూడా న‌మ్మ‌ద‌గిన‌వేనా.? అనే చ‌ర్చ ఇటు ప్ర‌జ‌ల‌లోనూ.. అటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌కు దారితీస్తుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.