Begin typing your search above and press return to search.

#లిక్కర్ క్వీన్.. ట్విటర్ లో ఇప్పుడు ఇదే ట్రెండింగ్

By:  Tupaki Desk   |   1 Dec 2022 5:51 AM GMT
#లిక్కర్ క్వీన్.. ట్విటర్ లో ఇప్పుడు ఇదే ట్రెండింగ్
X
ఢిల్లీ మద్యం కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పేరు మారుమోగుతోంది. కవిత బహిరంగంగా బయటకు వచ్చి నిర్దోషి అని చెప్పినప్పటికీ, ఆమె రాజకీయ ప్రత్యర్థులతో టార్గెట్ చేయబడుతోంది.. నిజానికి తనకు దర్యాప్తు సంస్థల నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని కవిత స్పష్టం చేశారు. అయినా ఊరుకోకుండా బలమైన సోషల్ మీడియా వింగ్ ఉన్న బీజేపీ కవితను అభాసుపాలు చేసేలా ట్విటర్ లో ట్రెండింగ్ చేస్తోంది.

ఈడీ తాజా రిమాండ్ నివేదికల్లో కవిత పేరు ఉంది. ఇందులో సౌత్ గ్రూప్ (శరత్ రెడ్డి, కె కవిత మరియు మాగుంట శ్రీనివాసుల రెడ్డి) ద్వారా రూ. 100 కోట్ల ముడుపులు ఢిల్లీ లిక్కర్ స్కాంలో చెల్లించినట్లు పేర్కొంది. ఆమె ఆద్మీ తరపున ఎస్.హెచ్ విజయ్ నాయర్ ఇప్పటివరకు ఈ 100 కోట్ల రూపాయల ముడుపులను అందుకున్నట్లు నివేదించబడింది. ఇది ఇప్పటివరకు జరిగిన విచారణలో తేలింది.

పీఎంఎల్‌ఏ చట్టం కింద ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ సిస్టమ్‌లో మనీలాండరింగ్‌కు సంబంధించిన దర్యాప్తు పేర్లను వెల్లడించింది. 32 పేజీల నివేదికలో సౌత్ గ్రూప్ కింద కె కవిత, శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేర్లు స్పష్టంగా పేర్కొన్నారు. పేర్లు బయటకు వచ్చిన వెంటనే, 'లిక్కర్ క్వీన్' అంటూ ట్విట్టర్ , ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండ్ అవుతోంది. ఇందులో ఆప్ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుండగా.. దక్షిణాది నుంచి టీఆర్‌ఎస్‌కి ఉన్న లింకులు దక్షిణాది రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

కేజ్రీవాల్‌ను నెటిజన్లు "లిక్కర్ కింగ్" అని ఎగతాళి చేస్తుంటే, కవిత ఇప్పుడు "లిక్కర్ క్వీన్" అని లేబుల్ చేయబడింది. గులాబీ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ హస్తం ఉందని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. టిఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి రావాలనుకుంటోందని, కాషాయ పార్టీ తమను లక్ష్యంగా చేసుకున్నారని వారు ఆరోపించారు.

ఇటీవల అరబిందో ఫార్మా హోల్ టైమ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని 3 రోజుల పాటు విచారించిన తర్వాత ఢిల్లీలో అరెస్టు చేశారు. శరత్ రాజ్యసభ ఎంపీ, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డికి అన్నయ్య. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన లింకులు దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ తన ప్రత్యర్థులను ఇలా ట్విటర్ లో ట్రెండ్ చేస్తూ అభాసుపాలు చేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.