Begin typing your search above and press return to search.

లింగమనేని దివాలా తీశారా?..క్వశ్చనే లేదబ్బా!

By:  Tupaki Desk   |   18 Nov 2019 4:15 PM GMT
లింగమనేని దివాలా తీశారా?..క్వశ్చనే లేదబ్బా!
X
ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట బంగ్లా యజమాని లింగమనేని రమేశ్ కు చెందిన కంపెనీ ఎల్ఈపీఎల్ (లీప్) దివాలా తీసిందంటూ సోమవారం వచ్చిన వార్తలు ఏపీతో పాటు తెలంగాణలోనూ కలకలం రేపిన సంగతి తెలిసిందే. అటు చంద్రబాబుతో పాటు ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న లింగమనేని... విజయవంతమైన పారిశ్రామికవేత్త కిందే లెక్క. ఏ రంగంలో అడుగుపెట్టినా... తనదైన శైలిలో రాణించిన లింగమనేని దివాలా తీశారా? అంటూ అంతా నోరెళ్లబెట్టిన పరిస్థితి. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవాలని స్వయంగా లింగమనేని ఓ డిటైల్డ్ ప్రకటన విడుదల చేయడంతో ఈ వార్తలన్నీ అసత్యాలని తేలిపోయింది.

ఈ క్లారిటీ ప్రకటనలో లింగమనేని ఏం చెప్పారన్న విషయానికి వస్తే... ‘లింగమనేని ప్రాజెక్ట్స్‌ దివాలా తీసినట్టు ప్రకటించాలని తాము కోరలేదు. జర్మనీకి చెందిన ఓ సంస్థతో ఎయిర్‌ కోస్తా ఒప్పందంలో కొన్ని సమస్యలొచ్చాయి. వాటిని పరిష్కరించుకునేలోపే సదరు సంస్థ.. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. జర్మన్ సంస్థ పిటిషన్ ఆధారంగా కంపెనీ లా ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంతో ఎల్ఈపీఎల్‌లోని ఇతర కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదు. మా ఆర్ధిక పరిస్థితులు బాగాలేవంటూ వచ్చిన కథనాలు అవాస్తవం. ఆర్థికంగా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. గతంలో మా రుణదాతలకు చెల్లింపులు చేయలేని పరిస్ధితి ఎప్పుడూ లేదు‘ అని లింగమనేని ఫుల్ క్లారిటీతో కూడిన ప్రకటనను విడుదల చేశారు.

1996లో విజయవాడలో రిజిస్టరైన లింగమనేని రమేశ్‌ కు చెందిన లీప్‌ కంపెనీ దివాలా తీసినట్టు ఈ నెల 14న కంపెనీ లా ట్రిబ్యునల్‌ ముందు పిటిషన్‌ దాఖలు చేసినట్టు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. తీసుకున్న రుణాలు చెల్లించలేనంటూ లింగమనేని కంపెనీ చేతులెత్తేయడంతో రుణాలు ఇచ్చిన కంపెనీలకు ఈ నెల 29 వరకు ఎన్సీఎల్టీ అనుమతి ఇచ్చినట్టు కూడా కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవాలని కొట్టిపారేయడంతోనే సరిపెట్టుకోని లింగమనేని... అసలు జరిగిన సంగతులేమిటన్న వివరాలను సమగ్రంగా విడుదల చేయడంతో ఈ వార్తలు అవాస్తవాలని తేలిపోయాయన్న వాదన వినిపిస్తోంది.