Begin typing your search above and press return to search.

అత్యాచారం కేసులో యువకుడికి యావజ్జీవ శిక్ష.. 25 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్

By:  Tupaki Desk   |   10 Jun 2021 10:30 AM GMT
అత్యాచారం కేసులో యువకుడికి యావజ్జీవ శిక్ష.. 25 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్
X
18 ఏళ్ల యువతిపై అత్యాచారం, ఆపై హత్య కేసులో ఓ యువకుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. తానే నేరం చేశానని అంగీకరించి కటకటాల వెనుక మగ్గుతున్నాడు ఆ యువకుడు. కాగా 25 ఏళ్ల తర్వాత ఈ కథ మలుపు తిరిగింది. సీన్ రివర్స్ అయ్యి పాతికేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడ్డాడు. ఇంతకీ ఏం జరిగింది? అసలు నిందితుడు ఎవరు? హత్య కేసుకు ఈ యువకుడికి సంబంధం ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం.

అమెరికాలోని ఇదాహో పట్టణంలో ఓ అపార్ట్మెంట్ లో 18 ఏళ్ల అంజీ డాడ్డ్ అనే యువతి ఉండేది. 1996 జూన్ 13న అర్ధరాత్రి ఆమెపై అత్యాచారం జరిగింది. ఓ వ్యక్తి ఆమె ఇంట్లోకి బలవంతంగా చొరబడి బలత్కరించాడు. అంతేకాకుండా తల, మొండెం వేరు చేసి హతమార్చాడు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. చేసేది లేక అంజీ డాడ్జ్ స్నేహితుల నేర చరిత్రను పరిశీలించారు. వారిలో ఓ యువకుడు అత్యాచారం చేసి, కత్తితో దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ యువకుడే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని అనుమానించారు. అతడిని అరెస్ట్ చేసి నేరం అంగీకరిస్తే శిక్ష తక్కువగా పడుతుందని చెప్పారట. లేదంటే ఉరిశిక్ష అని అన్నారట.

శిక్ష తీవ్రత తగ్గుతుందనే ఉద్దేశంతో ఆ యువకుడు నేరం అంగీకరించి కటకటల్లోకి వెళ్లాడు. డీఎన్ఏ మ్యాచ్ కాకపోయినా నేరం అంగీకరించినందున జైలు శిక్ష విధించారు. ఈ కేసుపై అంజీ డాడ్జ్ తల్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014లో తప్పుడు నేరాంగీకారాల విభాగం నిపుణులను కలిశారు. మళ్లీ ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఆ సమయంలో అంజీ డాడ్జ్ ఇంటి ముందు నివసించే బ్రయాన్ లీఫ్ డ్రిప్స్ సీనియర్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడింది అని తేలింది. అతడు వాడిన సిగరేట్ ఆధారంగా డీఎన్ఏ పరీక్ష చేయగా సరిపోలిందని పోలీసులు తెలిపారు. అత్యాచారం చేద్దామనుకున్న తాను మద్యం మత్తులో హత్య చేసినట్లు తెలిపాడు. అంజీ డాడ్జ్ కుటుంబానికి క్షమాపణలు చెప్పాడు.

డీఎన్ఏ సాంకేతికతో పాతికేళ్ల తర్వాత ఈ కేసు అసలు దోషి బయటపడ్డాడని జడ్జి తెలిపారు. ఈ కీలకమైన కేసులో వాస్తవాలు బయటకు రావడానికి 25 ఏళ్లు పట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయం జరగడానికి చాలా ఆలస్యమైందని అన్నారు. మొత్తానికి ఎలాంటి తప్పు చేయని ఓ వ్యక్తి 25 ఏళ్ల విలువైన జీవితం జైల్లోనే గడపాల్సి వచ్చింది. ఇంతటి దారుణానికి పాల్పడిన వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు.