Begin typing your search above and press return to search.

అంతుపట్టని మిస్టరీలకే కేరాఫ్ ఈ ఆలయం!

By:  Tupaki Desk   |   19 Nov 2019 1:30 AM GMT
అంతుపట్టని మిస్టరీలకే కేరాఫ్ ఈ ఆలయం!
X
అత్యంత అద్భుతమైన ఆ ఆలయాన్ని నిర్మించిన ఇద్దరు వ్యక్తులు అదే ఆలయంలో అంధులయ్యారు.. ఆ ఆలయంలో పై కప్పును మోసే ఒక స్తంభం వేలాడుతూ ఉంటుంది..ప్రపంచంలోనే అతి పెద్ద నాగ శిల కొలువైన ఆలయం అది.. వీటన్నింటికీ మించి కొన్ని శతాబ్దాలుగా అక్కడ కొన్ని రక్తపు మరకలు చెరగలేదు.. ఇలా ఎన్నో మిస్టరీలున్నాయి లేపాక్షి ఆలయంలో.

విజయనగర సామ్రాజ్య కాలంలో దక్షిణ భారత దేశంలో నిర్మితమైన అద్బుతమైన అలయాల్లో ఒకటి లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం. పదహారో శతాబ్దంలో అచ్యుతరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో లేపాక్షి ఆలయం నిర్మితం అయినట్టుగా చరిత్ర చెబుతోంది. ఈ ఆలయ నిర్మాతలు వీరన్న, విరుపన్నలు. వీరు నాడు విజయనగర సామ్రాజ్యంలో ఖజానా అధికారులుగా ఉండేవారని తెలుస్తోంది.

అత్యంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మింపజేసి, అదే సమయంలో అదే ఆలయంలో అంధులయ్యారు వీరన్న, విరుపన్నలు. అలా ఎందుకు జరిగిందనే అంశం కన్నా ముందు..లేపాక్షి చరిత్రను మరికొంచెం తెలుసుకోవాలి. వాస్తవానికి లేపాక్షికి హైందవ పురాణాల్లోనే ప్రస్తావన ఉంది

అలాంటి పవిత్రమైన చోట ఆలయం వెలసింది. ఇక్కడ వెలసిన మహిమాన్విత వీరభద్రస్వామికి అద్భుత ఆలయాన్ని పదహారో శతాబ్దంలో నిర్మించారు. వీరభద్రుడు వెలిసిన కొండను అంతా ఒక ఆలయంగా చెక్కారు. అక్కడి రాతి శిలలను అద్భుత శిల్పాలుగా మలిచిన వైనం గురించి ఎంత చెప్పినా తక్కువే!

ప్రధాన ఆలయానికి మొత్తం డెబ్బై రాతి స్తంభాలుంటాయి. వాటన్నిటి మీదా అద్భుతమైన శిల్ప కళ కొలువై ఉంటుంది. ఆ డెబ్బై స్తంభాల్లో ఒక స్తంభం మరింత అద్భుతం. పై నుంచి వేలాడుతూ ఉండటమే దాని ప్రత్యేకత.

భూమ్యాకర్షణ శక్తికి సవాల్ విసురుతున్నట్టుగా ఉంటుంది ఆ స్తంభం. సాధారణంగా రాతి నిర్మాణాల్లో పిల్లర్ లు పై భాగాన్ని మోస్తూ ఉంటాయి. అయితే అత్యంత ఆశ్చర్యకరంగా ఈ రాతి స్తంభాన్ని పై భాగం మోస్తూ ఉంటుంది, అది కిందకు వేలాడుతూ ఉంటుంది.

ఇది సైన్స్ కు అందని ఒక మిస్టరీగా నిలిచింది. మహిమాన్వితం అనిపించుకుంది. ఈ అద్భుతాన్ని పరిశోధించడానికి విదేశాల నుంచి కూడా అనేక మంది వచ్చి చూశారు.

భారతదేశంలోనే అతి పెద్ద నాగశిల ఉన్న ఆలయం కూడా లేపాక్షి ఆలయమే. ఒక భారీ కొండరాయిని ఐదు తలల నాగదేవతగా మలిచిన వైనానికి జోహార్లు చెప్పవచ్చు. తరచి చూస్తే లేపాక్షి ఆలయంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ప్రధాన ఆలయం లోపలి వైపున పై గోడలకు రామయణ - భారత గాథల వర్ణ చిత్రాలుంటాయి. కొన్ని వందల యేళ్లు అయినా అవి ఇప్పటికీ అలాగే ఉండటం నాటి కళా నైపుణ్యాలను చాటుతుంది. ఈ కూడ్య చిత్రాలు ప్రపంచంలోని అద్భుతాల్లో ఒకటని చెప్పవచ్చు.

ఆ అద్బుతాలను - అంతుపట్టని మిస్టరీలను కింది వీడియోలో చూడవచ్చు.