Begin typing your search above and press return to search.

తెలుగు నేల‌పై మిల్కాసింగ్.. సికింద్రాబాద్ లో ఆరేళ్ల‌పాటు పరుగులు!

By:  Tupaki Desk   |   19 Jun 2021 10:30 AM GMT
తెలుగు నేల‌పై మిల్కాసింగ్.. సికింద్రాబాద్ లో ఆరేళ్ల‌పాటు పరుగులు!
X
మిల్కాసింగ్ ఘ‌న‌త ఏంట‌న్న‌ది ప్ర‌పంచం మొత్తానికీ తెలుసు. ‘ఫ్లయింగ్ సిఖ్’గా కీర్తి ప్రతిష్టలు అందుకున్న ఆయ‌న‌.. ఆసియా క్రీడ‌ల‌తోపాటు కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లోనూ స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన ఏకైక ఇండియ‌న్ అథ్లెట్ గా చ‌రిత్ర సృష్టించారు. ఇక‌, ఇత‌రత్రా టోర్నీల్లో ఆయ‌న సాధించిన ప‌త‌కాలు ఎన్నో! మువ్వ‌న్నెల ప‌తాకాన్ని విశ్వ విను వీధుల్లో రెప‌రెప‌లాడించిన మిల్కాసింగ్‌.. 91 సంవ‌త్సరాల వ‌య‌సులో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సేవ‌ల‌ను, ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని దేశం స్మ‌రించుకుంటోంది.

మ‌న హైద‌రాబాద్ వాసులు కూడా ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని నెమ‌రు వేసుకుంటున్నారు. మిల్కా సింగ్ కు సికింద్రాబాద్ తో ఎంతో బంధం ఉంది. మిల్కా.. తొలి నాళ్ల‌లో ఆర్మీలో చేరారు. 1951లో సికింద్రాబాద్ ఆర్మీకి చెందిన ఎల‌క్ట్రిక‌ల్ మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్ సెంట‌ర్లో ఆయ‌న‌కు అడ్మిష‌న్ ల‌భించింది. ఆ విధంగా హైద‌రాబాద్ కు వ‌చ్చిన మిల్కా.. 1960 వ‌ర‌కు సికింద్రాబాద్ లోనే నివ‌సించారు. ఆ స‌మ‌యంలో బొల్లారం అమ్ముగూడ‌ ప‌హాడ్‌చుట్టూ ర‌న్నింగ్ ప్రాక్టీస్ చేసేవారు.

స్టామినా మ‌రింత‌గా పెంచుకునేందుకు రాళ్లు నింపిన బ్యాగును వీపున త‌గిలించుకొని.. అమ్ముగూడ ప‌హాడ్ చుట్టూ ప‌రుగులు తీసేవారు మిల్కా. అంతేకాదు.. బొల్లారం రైల్వే స్టేష‌న్ ప‌రిస‌రాల్లోనూ ఆయ‌న ప‌రుగులు పెట్టేవారు. ఈ స్టేష‌న్ నుంచి రాక‌పోక‌లు సాగించే రైలుతో ప‌రుగు పందెం పెట్టుకొనేవారు. సికింద్రాబాద్ లో రైలుతో పోటీ పెట్టుకొని పరిగెత్తాన‌ని మిల్కా సింగ్ స్వ‌యంగా చెప్పారు.

ఆ త‌ర్వాత అంచెలంచెలుగా ఎదిగిన మిల్కా ఎన్నో ప‌త‌కాలు సాధించారు. 1958లో నిర్వ‌హించిన ఆసియా గేమ్స్ లో భార‌త్ కు స్వ‌ర్ణ‌ ప‌త‌కాల‌ను సాధించి పెట్టారు. ఈ క్రీడ‌ల్లో.. 200, 400 మీట‌ర్ల విభాగంలో బంగారు ప‌త‌కాల‌ను గెలుచుకున్నారు. అదే ఏడాది నిర్వ‌హించిన కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లోనూ సత్తా చాటారు. 1962లో నిర్వ‌హించిన ఆసియా గేమ్స్ లోనూ రెండు స్వ‌ర్ణాల‌ను గెలుచుకున్నారు. ఈ విధంగా.. రాకెట్ వేగంతో దూసుకెళ్లిన మిల్కా.. ఎన్నో అద్భుత విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు.

ఆయ‌న ఘ‌న‌త‌లను కీర్తిస్తూ.. సికింద్రాబాద్ లోని ఈఎంఈ సెంట‌ర్లో ఓ కాల‌నీకి మిల్కాసింగ్ కాల‌నీ అని పేరు కూడా పెట్టారు. అంతేకాదు.. అందులోని స్టేడియానికి కూడా మిల్కా పేరే ఉంది. అలాంటి ఫ్ల‌యింగ్ సిఖ్ ఈ లోకాన్ని వీడి వెల్ల‌డంతో.. సికింద్రాబాద్ వాసులు మిల్కాను గుర్తు చేసుకుంటున్నారు.