Begin typing your search above and press return to search.

మాస్కు పెట్టుకోకుండా వాదించిన లాయర్.. వాయిదా వేసిన హైకోర్టు

By:  Tupaki Desk   |   1 March 2021 4:30 AM GMT
మాస్కు పెట్టుకోకుండా వాదించిన లాయర్.. వాయిదా వేసిన హైకోర్టు
X
నో మాస్క్.. నో ఎంట్రీ.. ఈ బోర్డు అన్ని చోట్ల కనిపిస్తున్నదే. కరోనా కారణంగా కొత్తగా వచ్చిన మార్పుల్లో ఇదొకటి. మహమ్మారి మరింత వ్యాపించకుండా ఉండేందుకు మాస్కు పెట్టుకోవటం.. భౌతికదూరాన్ని పాటించటం కరోనా కాలంలో తప్పనిసరైంది. ఇలాంటివేళలో.. మాస్కు పెట్టుకోకుండా ఒక కేసులో వాదనలు మొదలు పెట్టిన న్యాయవాది తీరును తప్పు పట్టిన మహారాష్ట్ర హైకోర్టు కేసును వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

హైకోర్టుకు చెందిన సింగిల్ బెంచ్ న్యాయమూర్తి పృథ్వీరాజ్‌ చవాన్ ఈ ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజాగా హైకోర్టులో ఒక కేసు విచారణను మొదలుపెట్టిన లాయర్.. ముఖానికి మాస్కు పెట్టుకోకుండా వాదనలు మొదలు పెట్టటంతో.. కేసును విచారించేందుకు సింగిల్ జడ్జి అంగీకరించలేదు. మాస్కు లేకుండా వాదనలు వినిపించటం సరికాదని పేర్కొంటూ విచారణను వాయిదా వేసేశారు. లాక్ డౌన్ కాలంలో పని చేయని కోర్టులు.. ఆ తర్వాత ఆన్ లైన్ లోనే వాదనలు వినిపించిన పరిస్థితి.

ఈ మధ్యనే భౌతికంగా హాజరవుతూ వాదనలు వినిపించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. కరోనా పీడ ఇంకా తొలిగిపోని నేపథ్యంలో.. కేసును విచారించిన న్యాయవాదులందరిని వేరే గదిలో ఉంచి.. ఏ కేసుకు ఆ కేసు విచారణకు సంబంధిత లాయర్ ను.. వారి సంబంధికుల్ని మాత్రమే అనుమతిస్తూ.. విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖానికి మాస్కు తప్పనిసరి చేశారు. ఆ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా వాయిదా నిర్ణయాన్ని తీసుకోవటం ఇప్పుడు చర్చగా మారింది.