రాత్రి కర్ఫ్యూలో లాఠీఛార్జి.. ఫేక్ వీడియో.. యూట్యూబ్ రిపోర్టర్ అరెస్ట్ !

Wed Apr 21 2021 15:38:11 GMT+0530 (IST)

Lathicharge in night curfew Fake video YouTube reporter arrested!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోవడంతో .. కరోనా వైరస్  కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ముగ్గురు పోలీస్ కమిషనర్లు స్వయంగా రంగంలోకి దిగి అనేక ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించారు. అయితే కొందరు బాధ్యతలేని పౌరులు మాత్రం నైట్ కర్ఫ్యూ పై జనాల్లో అపోహలు కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.కర్ఫ్యూ విషయంలో ఓ యూట్యూబ్ చానల్ రిపోర్టర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. హైదరాబాద్ రాత్రి కర్ఫ్యూ సందర్భంగా లాఠీఛార్జీ చేశారంటూ నకిలీ వీడియోను తమ చానల్‌లో పోస్టు చేశాడు. దీన్ని గమనించిన హైదరాబాద్ పోలీసులు టెక్నాలజీ సాయంతో కొద్ది సమయంలోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా సోషల్‌మీడియాలో ఇలాంటి ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరికలు జారీచేశాడు.