అందరి కళ్ళు ఆ ఎంపీ పైనేనా ?

Wed Oct 05 2022 23:00:01 GMT+0530 (India Standard Time)

Latest Updates About Komati Reddy Venkat Reddy

కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఉపఎన్నికకు సంబందించి నేతలందరి కళ్ళు ఆ ఎంపీపైనే కేంద్రీకృతమయ్యున్నాయి. ఇంతకీ ఆ ఎంపీ ఎవరంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డే. వెంకటరెడ్డిపైనే ఎందుకంటే ఆయన స్వయాన మునుగోడులో బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి అన్న కాబట్టే. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో విభేదాల కారణంగానే కాంగ్రెస్ ఎంఎల్ఏగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీని వదిలేసి బీజేపీలో చేరిపోయారు.అప్పటినుండి ఏదో ఒక విషయంలో రేవంత్ తో వెంకటరెడ్డి గొడవపడుతునే ఉన్నారు. దాంతో అందరికీ ఎంపీ ఉపఎన్నికలో పార్టీకి హ్యాండిస్తారనే అనుమానాలు పెరిగిపోయాయి.

రేవంత్ మీద అలిగి కొన్నిరోజులు పార్టీ నేతలు అవమానిస్తున్నారని మరికొన్ని రోజులు ఎంపీ పార్టీకి దూరంగా ఉన్నారు. దాంతో చాలారోజులుగా పార్టీ కార్యక్రమాల్లో ఎంపీ ఎక్కడా కనబడలేదు. ఈ నేపధ్యంలోనే అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతిని అధిష్టానం ప్రకటించింది.

తన అభ్యర్ధిత్వం ఖరారు కాగానే ఆమె నేరుగా వెళ్ళి ఎంపీని కూడా కలిసి మద్దతు అడిగారు. అయినా వెంకటరెడ్డి చప్పుడుచేయలేదు. దాంతో చేసేదిలేక కలిసివచ్చే నేతలతో స్రవంతి ప్రచారం చేసుకుంటున్నారు.

ఈ నేపధ్యంలోనే ఉపఎన్నికకు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. దాంతో కీలకమైన నేతలంతా సమావేశమయ్యారు. ఈ సందర్భంలోనే స్రవంతి మాట్లాడుతు తాను ఎంపీతో మాట్లాడానని ప్రచారానికి తప్పకుండా వస్తానని మాటిచ్చినట్లు చెప్పారు. దాంతో సీనియర్లలో ఎంపీ ప్రచారానికి వస్తారనే ఆశలు మొదలయ్యాయి.

అయితే ఎంపీ ఎప్పటినుండి ప్రచారంలోకి దిగుతారు ? ఆయనతో కలిసి వెళ్ళే నేతలెవరు అనే విషయాల్లో మాత్రం అందరిలోను అయోమయమే కంటిన్యు అవుతోంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే తమ్ముడు రాజగోపాలరెడ్డికి వ్యతిరేకంగా ఎంపీ మనస్పూర్తిగా పనిచేస్తారా ? అన్నదే అనుమానం. పార్టీ నేతలు ఆశిస్తున్నట్లు ఎంపీ గనుక మనస్పూర్తిగా స్రవంతి గెలుపుకు పనిచేస్తే పార్టీ గెలుపు కష్టమేమీకాదు. మరి ఎంపీ ఏమి చేస్తారన్నదే సస్పెన్సుగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.