Begin typing your search above and press return to search.

మూడు రాజధానుల చట్టం దిశగా... పక్కా పొలిటికల్ ప్లాన్...?

By:  Tupaki Desk   |   4 Dec 2022 5:30 AM GMT
మూడు రాజధానుల చట్టం దిశగా... పక్కా పొలిటికల్ ప్లాన్...?
X
ఏపీలో మూడు రాజధానులు అంశం మరోమారు గట్టిగా రగులుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో దీనిని ముందు పెట్టి గరిష్టంగా రాజకీయ ప్రయోజనాలు పొందాలని వైసీపీ చూస్తోంది. ఏపీలో ఈ రోజుకు చూస్తే అమరావతి రాజధానిగా ఉంది. ఎందుకంటే హై కోర్టు తుది తీర్పులో ఆ విషయాన్నే పేర్కొంది కాబట్టి. పైగా గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్నారు.

ఈ నేపధ్యంలో రాజధాని ఏది అంటే అమరావతి అనే చెప్పాలి. మరో వైపు చూస్తే వైసీపీ సర్కార్ కి అమరావతి రాజధాని అన్న దాని కంటే మూడు మీదనే మోజు ఉంది. పైగా అది తమకు రాజకీయంగా కలసివస్తుందని అంచనా వేసుకుంటోంది. ఈ క్రమంలో సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన ఏపీ సర్కార్ కి అక్కడ కొన్ని కీలకమైన అంశాలలో స్టే లభించింది.

అందులో చూసుకుంటే అమరావతి రాజధానిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయకుండా స్టే ఆర్డర్ వచ్చింది. దాంతో ప్రస్తుతానికి అమరావతి విషయంలో కొంత ఉపశమనం కలిగింది. దాంతో వైసీపీ ఇదే ఊపులో మూడు రాజధానుల చట్టాన్ని చేయడానికి ఉత్సాహపడుతోంది. తాము ఉపసంహరించుకున్న చట్టం మీద హై కోర్టు ఎలా తీర్పు ఇస్తుంది అని సుప్రీం లో రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది.

అయితే దీని మీద జనవరి 31న హై కోర్టు విచారణ ఉంది. పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని మీద తాము విచారణ చేస్తామని అన్ని వైపుల నుంచి వాదనలు వింటామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది దాని అర్ధం ఏంటి అన్నది ఎవరికి వారు భాష్యాలు చెప్పుకుంటున్నా ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల విషయంలో జోరు చేస్తోంది.

సుప్రీం కోర్టులో అమరావతి పిటిషన్ విచారణ దశలో ఉండగా మూడు రాజధానుల చట్టం చేయడం సాధ్యమేనా చేస్తే అది న్యాయ పరీక్షకు ఎంతవరకు నిలబడుతుంది అన్న ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. పైగా సుప్రీం కోర్టు ఇపుడు హై కోర్టు తీర్పు మీద అమరావతి రాజధాని చట్టబద్ధత మీద విచారణకు సిద్ధపడుతున్న క్రమంలో మూడు రాజధానులు అంటే దాని మీద కూడా విచారణ జరుపుతారా అన్నది కూడా మరో సందేహంగా ఉంది.

అయితే న్యాయపరమైన చిక్కులు లేకుండానే మూడు రాజధానుల చట్టం చేస్తామని ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి చెబుతున్నారు. అమరావతి ఏకైక రాజధాని అని హై కోర్టు ఇచ్చిన తీర్పు పై సుప్రీం విచారణ చేస్తూండగా మూడు అంటే అది న్యాయపరంగా కొత్త చిక్కులనే తెస్తుంది అని అంటున్నారు. అయితే ఇక్కడ పలు కీలక విషయాలను వైసీపీ దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగవచ్చు అని అంటున్నారు.

మొదటిది ఏంటి అంటే తాము అనుకున్నట్లుగా మూడు రాజధానుల పేరిట చట్టం చేయడం. ఈ చట్టాన్ని ఎటూ అమరావతి రైతులు సుప్రీం కోర్టులో సవాల్ చేస్తారు. ఇప్పటిదాకా లేని చట్టం మీద హై కోర్టు తీర్పు ఇచ్చింది అని ప్రభుత్వం అప్పీల్ కి వెళ్ళింది. ఇపుడు ఉన్న చట్టం మీద సుప్రీం ఏమంటుందో కూడా తెలుసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తే కనుక ఆ విధంగా చట్టం చేస్తుంది. అది న్యాయ స్థానంలో వీగిపోయినా లేక కొట్టేసినా తాము మూడు రాజధానులకే కట్టుబడి చట్టం కూడా చేశామని, అయితే న్యాయ పరమైన ఇబ్బందుల వల్ల అది సాకారం కాలేదని జనాల్లో చెప్పి మూడుకు తాము ఎప్పటికీ కట్టుబడి ఉన్నట్లుగా చెప్పుకుని తన సెంటిమెంట్ రాజకీయాన్ని పండించుకోవచ్చు.

ఒక వేళ అది కాదు కోర్టు చిక్కులు ఎందుకు అనుకుంటే కనుక రాజధానులు అన్న ప్రస్థావన లేకుండా విశాఖ, కర్నూల్ లలో తాము చేయబోయే దాన్ని చెబుతూ ఆ విధంగా చట్టం చేయడం అన్న మాట. దీని వల్ల ఇప్పటికే రాజధాని అన్న అంశం ఎటూ జనాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ప్రత్యేకించి రాజధానులు అని చట్టం చేసి చిక్కులలో పడే ప్రమాదం నుంచి తప్పించుకోవడం అన్న మాట.

ఇక వీటికి మించి మూడవ ఆలోచన కూడా ప్రభుత్వం చేయవచ్చు అని అంటున్నారు. అదెలా అంటే విశాఖలో పాలనను నిర్వహిస్తామని చెబుతూ హై కోర్టు విషయం మీద కర్నూల్ కి హమీ ఇస్తూనే ఒక అసెంబ్లీ సెషన్ ని రాయలసీమలో నిర్వహించడం ద్వారా దానికి కూడా రాజధాని గుర్తింపు ఇవ్వడం అన్న మాట. ఇలాంటివి దేశంలో చాలా చోట్ల జరుగుతున్నాయి కాబట్టి ఇబ్బంది లేకపోవచ్చు అంటున్నారు.

ఏది ఏమైనా ఈ దశలో వైసీపీ జోరు చేస్తోంది అంటే అది కచ్చితంగా 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే అని అంటున్నారు. అమరావతికి నై అంటూ మూడు రాజధానులు కూడా అమలు చేయకపోతే వైసీపీ రెండిందాలా చెడుతుంది అన్న భయం ఉంది అంటున్నారు. అదే టైం లో విపక్షం కూడా ఇదే అంశం మీద జనంలోకి వెళ్ళి వైసీపీని బదనాం చేసే వీలుంది. అందుకే మూడు రాజధానుల విషయంలో తగ్గేదిలే అంటూ వైసీపీ ఇపుడు దూకుడు చేస్తోంది అని అంటున్నారు. దీని ద్వారా విపక్షాన్ని కూడా ఉప ప్రాంతీయ సెంటిమెంట్ తో కార్నర్ చేయాలన్నదే అజెండాగా ఉంది అని అంటున్నారు.