Begin typing your search above and press return to search.

విచారణ కోసం కోర్టుకు పాక్ ప్రధాని: సీఎంగా ఉండి జీతం తీసుకోలేదు.. ఆరోపణలా?

By:  Tupaki Desk   |   29 May 2022 4:30 AM GMT
విచారణ కోసం కోర్టుకు పాక్ ప్రధాని: సీఎంగా ఉండి జీతం తీసుకోలేదు.. ఆరోపణలా?
X
తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాబజ్ షరీఫ్. మనీ లాండరింగ్ ఆరోపణల్ని ఎదుర్కొంటూ.. పలు కేసులు తనపై నమోదైన నేపథ్యంలో విచారణ కోసం కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కోర్టు అనుమతి తీసుకొని తన వాదనల్ని వినిపించారు. తన నిజాయితీని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా తనను తాను దూషించుకోవటం గమనార్హం.

తనను తాను మజ్నూగా (ఫూల్.. తెలివితక్కువవాడు) అభివర్ణించుకున్న ఆయన.. తన మీద ఆరోపణల్ని తీవ్రంగా ఖండించుకున్నారు. దేవుడి దయతో తాను దేశ ప్రధానమంత్రిని అయ్యానని.. కానీ తానో ఫూల్ నని.. అందుకే పన్నెండున్నరేళ్ల తన పదవీ కాలంలో ఏ రోజూ ప్రభుత్వం నుంచి ఏమీ తీసుకోలేదన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీతం కూడా తీసుకోలేదని.. తనకు న్యాయపరంగా ఉన్న హక్కుల్ని కూడా వినియోగించుకోలేదన్నారు.

తాను సీఎంగా ఉన్నప్పుడు చెక్కర ఎగుమతులపై పరిమితులు విధించానని.. ఆ సమయంలో తన సెక్రటరీ తనకు ప్రయోజనం కల్పిస్తుందంటూ ఒక నోట పంపినా రిజెక్టు చేశానన్నారు. ‘‘ఆ నిర్ణయంతో నా కుటుంబానికి 2 బిలియన్ల పాకిస్థానీ రూపీలు నష్టపోయింది. నా కొడుకు ఇథనాల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసిన సమయంలోనూ ఇథనాల్ పై సుంకం విధించాను. ఈ నిర్ణయంతో నా ఫ్యామిలీ 800 మిలియన్ల పాకిస్థానీ రూపీలను కోల్పోవాల్సి వచ్చింది’’ అంటూ తన త్యాగాల్ని చెప్పుకునే ప్రయత్నం చేశారు.

రాజకీయ కుట్రలో భాగంగానే తన మీద కేసులు నమోదు చేశారన్నారు. గతంతో పాక్ ప్రధానిగా పని చేసిన నవాజ్ షరీఫ్ కు సోదరుడయ్యే షెహబాబజ్ షరీఫ్.. అప్పట్లో పంజాబ్ ప్రావిన్స్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించేవారు. 1999లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత షెహబాజ్ ఫ్యామిలీ దేశం నుంచి వెళ్లిపోయింది. ఎనిమిదేళ్లు సౌదీ అరేబియాలో అండర్ గ్రౌండ్ లో ఉండిపోయిన ఆయన కుటుంబం తర్వాత అంటే.. 2007లో మళ్లీ పాక్ కు చేరుకుంది.

అలా తిరిగి వచ్చిన కొద్ది నెలలకే అంటే.. 2008లో మరోసారి పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2013లో మూడోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఆయన.. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానంతో సర్కారు పతనమైంది. దీంతో.. దేశ ప్రధానిగా షెహబాజ్ బాధ్యతలు చేపట్టారు. అయితే.. ఆయనపై మనీ లాండరింగ్ కేసులు విచారణ నేపథ్యంలో కోర్టుకు హాజరయ్యారు. ఇక.. షెహబాజ్ కొడుకు హంజా ఇప్పుడు పంజాబ్ ప్రావిన్సు కు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు.

దేశ ప్రధానిగా షెహబాజ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. మొత్తానికి కోర్టుకు హాజరైన పాక్ ప్రధాని.. తన నిజాయితీ.. కమిట్ మెంట్ ఎంతన్న విషయాన్ని చెప్పే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.