పిచ్చ లైట్ అనేస్తూనే.. ప్రగతిభవన్ లో లేట్ నైట్ వరకు అదే చర్చనట

Sat Aug 13 2022 10:28:47 GMT+0530 (IST)

Munugodu Byelection Meeting At Pragathi Bhavan

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్న సామెతకు ఏ మాత్రం తీసిపోని రీతిలో రాజకీయ నేతల మాటలు ఉంటాయి. వారు ఎప్పుడు ఏం మాట్లాడతారన్నది ఎవరూ చెప్పలేరు. తమకు ప్రయోజనం కలిగితే.. ఏ క్షణంలో అయినా ఇట్టే మాటను తిప్పేస్తారు. తమకు అనుకూలమైన వాదనను వినిపిస్తుంటారు. మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్ అధినాయకత్వం తీరు కూడా ఇంచుమించు ఇలానే ఉందన్న మాట వినిపిస్తోంది.మునుగోడు ఉప ఎన్నికను తాము సీరియస్ గా తీసుకోవటం లేదని.. దానికి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదని మంత్రి కేటీఆర్ ఆ మధ్యన విలువైన మాట ఒకటి చెప్పారు. రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికలు ఏవైనా సరే.. అన్ని శక్తుల్ని కూడదీసుకొని మరీ.. రచ్చ చేసే టీఆర్ఎస్ పార్టీ తన తీరుకు భిన్నంగా మాట్లాడటం కాస్తంత ఆసక్తికరంగా అనిపించింది.

అయితే.. చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం లేకుండా ఉండే ప్రగతిభవన్ లో పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక మీద ఇటీవల కాలంలో భారీ చర్చ జరుగుతుందని చెబుతున్నారు. మొన్నటికి మొన్న మునుగోడు టికెట్.. ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం మీదన రాత్రి ఎడెనిమిది గంటల మధ్యలో మొదలైన చర్చ.. అర్థరాత్రి పన్నెండు దాటిన తర్వాత వరకు సాగుతూనే ఉందని చెబుతున్నారు. పైకి మునుగోడు ఉప ఎన్నికకు పెద్దగా ప్రయారిటీ లేదని చెప్పే దానికి భిన్నంగా పరిస్థితి ఉందంటున్నారు.

ప్రగతిభవన్ లో  లేట్ నైట్ వరకు సాగుతున్న చర్చల్ని చూస్తే.. మునుగోడులో గెలుపు కోసం గులాబీ బాస్ ఎంతలా కసరత్తు చేస్తున్నారో అర్థం కాక మానదు. చూస్తుంటే.. ఉప ఎన్నికకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వట్లేదని చెబుతూ.. సానుకూల ఫలితం వచ్చేందుకు భారీ ఎత్తున కసరత్తు చేసే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లుగా చెప్పాలి.

లో ప్రొఫైల్ తో ప్రత్యర్థుల్ని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు.మరి.. కేసీఆర్ ప్లాన్ ఎంతవరకు వర్కువుట్ అవుతుందో చూడాలి.